ఆకాశం నీ హద్దురా సినిమా 'రివ్యూ'

Akasham Nee Haddu Ra Movie Review. నిబంధ‌న‌లు పాటిస్తూ.. థియేట‌ర్ల‌ను ఓపెన్ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికి ఇంకా చాలా చోట్ల ఓపెన్ కాలేదు.

By Medi Samrat  Published on  12 Nov 2020 7:19 AM GMT
ఆకాశం నీ హద్దురా సినిమా రివ్యూ

చిత్రం : ఆకాశం నీ హద్దురా

నటీనటులు: సూర్య, అపర్ణ బాలమురళి, పరేష్ రావల్, మోహ‌న్ బాబు, ఊర్వ‌శి త‌దిత‌రులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి

కథ : సుధ కొంగర

స్క్రీన్ ప్లే: సుధ కొంగర, షాలిని, ఉషాదేవి

మాటలు: రాకేందు మౌళి

నిర్మాత : సూర్య

దర్శకత్వం: సుధ కొంగర

ఎడిట‌ర్ : స‌తీష్ సూర్య‌

నిబంధ‌న‌లు పాటిస్తూ.. థియేట‌ర్ల‌ను ఓపెన్ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికి ఇంకా చాలా చోట్ల ఓపెన్ కాలేదు. ఇక థియేట‌ర్ల బంద్‌తో ఓటీటీ హ‌వా కొన‌సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో ఓటీటీలో విడుదలైన అతి పెద్ద చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. సూర్య కథానాయకుడిగా 'గురు' ఫేమ్ అయిన సుధ కొంగర ద‌ర్శ‌కత్వంలో రూపుదిద్దుకున్న చిత్ర మిది. ఎయిర్ డెక్క‌న్ స్థాపించి అంద‌రికీ త‌క్కువ ధ‌ర‌కే విమాన ప్ర‌యాణ సౌక‌ర్యాం అందించిన కెప్టెన్ గోపినాథ్ జీవితంలోని అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భారీ అంచనాల మధ్య ఈ రోజే అమేజాన్ ప్రైం ద్వారా విడుదలైన ఈ చిత్రం అభిమానుల‌ను ఎంత మేరా ఆకట్టుకుందో చూద్దాం.

కథ : మహా (సూర్య) గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఓ మాములు మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. ఓ విషయంలో తండ్రితో గొడవపడి ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం సాధిస్తాడు. ఐతే తండ్రి చావుబతుకుల్లో ఉన్న సమయంలో చేతిలో సరిపడా డబ్బుల్లేక విమానంలో ప్రయాణించలేకపోయిన మహా.. తండ్రి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతాడు. ఆ చేదు అనుభవం తర్వాత సామాన్యులకు అతి తక్కువ ధరకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించాలని అతను లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఐతే సామాన్యుడైన అతను కన్న ఈ భారీ కల నెరవేర్చుకునే ప్రయత్నంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? ఇంతకీ తక్కువ ధరలో విమాన ప్రయాణం అనే ఆలోచన చుట్టే మహా జీవితం ఎందుకు సాగింది ? దానికి కారణం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

క‌థా విశ్లేష‌ణ‌ : బ‌యోపిక్‌లు తీయాలంటే చాలా ధైర్యం కావాలి. అచ్చంగా క‌థ చెప్పేస్తే బోర్ కొడుతుంది. మ‌రీ సినిమాటిక్‌గా చెబితే.. విష‌యం ప‌క్క‌దారి ప‌డుతుంది. అయితే.. ఈ విష‌యంలో సుధ కొంగ‌ర విజ‌యం సాధించార‌నే చెప్పాలి. ఎయిర్ డెక్కన్ ఎయిర్ లైన్స్ తో భారత విమాన యాన రంగంలో సంచలనాలకు తెర తీసిన గోపీనాథ్ జీవిత కథను అర్థవంతంగా ఉద్వేగ భరితంగా తెరపై చూపించి ప్రేక్షకుల్లో కదలిక తీసుకు రాగలిగింది. ఆయ‌న జీవిత ప్ర‌యాణంలో ఏ ఒక్క స్టేజీని వ‌ద‌ల‌కుండా చూపించారు. దానికి వినోదం, క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన అంశాలు జోడించి రాసుకొచ్చారు. వాస్తవ గాథ కావడం వల్ల దానికున్న పరిమితులు అక్కడక్కడా ఇబ్బంది పెట్టినా.. సుధ-సూర్య కలిసి నిజాయితీగా.. శ్రద్ధగా చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల మనసు దోస్తుంది.

గోపినాధ్ జీవితాన్ని ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆమె రాసుకున్న స్క్రిప్ట్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఆ స్క్రిప్ట్ కి తగట్లు సరైన ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. పైగా సెకెండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, ప్రీ క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. వీటికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో నిజ జీవిత కథలో సహజత్వం చాలా వరకు లోపించింది.

ఎవ‌రెలా చేశారంటే..?

సూర్య వ‌న్ మ్యాన్ షో అని చెప్ప‌వ‌చ్చు. విమాన‌యాన సంస్థ పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించే యువ‌కుడిగా, ఊరికి వెళ్ల‌డానికి డ‌బ్బులు లేక టికెట్ కొన‌లేక‌పోయిన సంద‌ర్భాల్లో సూర్య జీవించాడ‌నే చెప్పాలి. ఇక భ‌ర్త‌ను అర్ధం చేసుకునే పాత్రలో అపర్ణ చ‌క్క‌గా న‌టించింది. గ‌డుసుత‌నం చూపిస్తూనే అనుకున్న‌ది సాధించే మ‌హిళ‌గా క‌నిపించింది. భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు పాత్ర‌లో మోహ‌న్ బాబు త‌న‌దైన శైలిలో న‌టించారు. ప‌రేశ్ రావ‌ల్‌, ఊర్వ‌శి, ఇత‌ర న‌టీ న‌టులు త‌మ పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేసిన నిఖిత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని మెయిన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు జివీ ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ స్ లో నేపథ్య సంగీతం చాల బాగుంది. ఎడిటర్ సతీష్ సూర్య ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

చివ‌ర‌గా : ఆకాశం నీ హద్దురా.. ప్రేరణగా నిలిచే ఓ విజేత ప్ర‌యాణం


Next Story