అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'థ్యాంక్ గాడ్' చిత్రంపై విమర్శలు వస్తున్నాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలపై నటీనటులు, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం ట్రైలర్ సెప్టెంబర్ 9న విడుదలైంది. థాంక్స్ గాడ్ ట్రైలర్‌లో కనిపించే విధంగా, మరణానంతరం ప్రతి ఒక్కరి పాపాలను, పుణ్యాలను లెక్కించే చిత్రగుప్తుడుగా అజయ్ దేవగన్ కనిపిస్తాడు.
కర్ణాటకలోని హిందూ జనజాగృతి సమితి ఈ సినిమా ట్రైలర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ జనజాగృతి సమితి ప్రతినిధి మోహన్‌గౌడ్ మాట్లాడుతూ.. ట్రైలర్‌లో నటీనటులు హిందూ దేవుళ్లను అవహేళన చేస్తూ కనిపించారని, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో హిందూ మతానికి చెందిన చిత్రగుప్తుడు, యమదేవుడిని అవహేళన చేయడం మేం ఎప్పటికీ సహించబోమని అన్నారు. ఈ ట్రైలర్ విడుదలయ్యే వరకు సెన్సార్ బోర్డు నిద్రపోయిందా?.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నందున రాష్ట్ర, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలు సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ లను పట్టించుకోకుండా సినిమాలను రిలీజ్ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అక్టోబర్ 25న సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తూ ఉన్నారు.