సినిమా అన్నది ఎన్నో కష్టాలు పడి తీస్తారు. ఎంతో మంది కష్టం కూడా ఆ సినిమా వెనుక ఉంటుంది. తమ ట్యాలెంట్ ను వెండితెర మీద చూసుకోవాలని అనుకునే వాళ్లకు పైరసీ పెద్ద షాక్ ఇస్తూ ఉంటుంది. అలాగే లీకులు కూడా టెన్షన్ పెడుతూ ఉంటాయి. జబర్దస్త్ కమెడియన్లు అదిరే అభి, గడ్డం నవీన్ నటించిన కొత్త సినిమా 'పాయింట్ బ్లాంక్' సినిమాకు లీకుల బెడద ఎదురవ్వడంతో పోలీసులను ఆశ్రయించారు. అదిరే అభి, గడ్డం నవీన్ కీలక పాత్రల్లో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన 'పాయింట్ బ్లాంక్'. సాయి పవన్ సంగీతం అందించాడు. పి.సి. కన్నా సినిమాటోగ్రఫీ అందించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదలవ్వబోతోంది. సైబర్ నేరగాళ్లు విడుదలకు ముందే ఈ సినిమాను పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని చిత్ర దర్శకనిర్మాతలతో పాటు జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తమ ఫిర్యాదు నమోదు చేశారు. కష్టపడి తీసిన తమకు తెలియకుండానే ఇలా ఆన్‌లైన్‌లో లీక్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఆ ప్రింట్ ఆన్‌లైన్‌లో తీసేయాలని పోలీసులను కోరారు.
ఇటీవలి కాలంలో లీకులు పెద్ద పెద్ద సినిమాలను కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' ఒరిజినల్ కాపీ ఆన్ లైన్ లో విడుదలై నిర్మాతలకు షాకిచ్చింది. భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదల కానుండగా ఇంతలోనే సినిమా లీక్ అయింది. ఈ విషయంపై చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించి, మాస్టర్ ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. మీ వద్దకు లీక్ అయిన దృశ్యాలు వస్తే వాటిని దయచేసి షేర్ చేయకండి. విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది" అని తన ట్విట్టర్ ఖాతాలో లోకేశ్ కనకరాజ్ పోస్టు చేశారు.