ప్రముఖ మలయాళ సీరియల్ నటుడు రమేశ్‌ వలీయశాల ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. సీనియర్ నటుడు శ‌నివారం ఉదయం తిరువనంతపురంలోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆయన మరణంతో కేరళ చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లిపోయింది. ఆయన వయసు 54 సంవత్సరాలు. 22 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ డాక్టర్ జానరధనన్ అతని గురువు. 1999 నుంచి సీరియల్స్‌లో నటిస్తున్నాడు రమేశ్‌ వలియశాల. కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. షూటింగ్స్ కూడా స్వ‌చ్ఛందంగా నిలిపివేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కొద్దిరోజులుగా ఆయ‌న‌ ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ మార్చురీకి తరలించారు. ఆత్మ‌హ‌త్య‌పై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెండవ భార్య, కుమారుడుతో కలిసి వాలియశాలలోని తన నివాసంలో ఉంటున్నాడు రమేశ్‌. కేర‌ళ‌లో ర‌మేశ్‌కు మంచి గుర్తింపు ఉంది. సీరియ‌ల్స్‌తో పాటు ప‌లు సినిమాల్లోనూ ఈయ‌న న‌టించాడు. ర‌మేశ్ మ‌ర‌ణవార్త తెలిసి కేర‌ళ చిత్ర ప్ర‌ముఖులు, ప్రేక్ష‌కులు దిగ్భ్రాంతికి గుర‌య్యారు.


సామ్రాట్

Next Story