గడ్డి మందును బ్యాన్ చేయండి..ప్రధాని, సీఎంకు అర్జున్‌రెడ్డి నటుడి రిక్వెస్ట్
పారాక్వాట్' (Paraquat) గడ్డి మందును తక్షణమే నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు.
By - Knakam Karthik |
గడ్డి మందును బ్యాన్ చేయండి..ప్రధాని, సీఎంకు అర్జున్‌రెడ్డి నటుడి రిక్వెస్ట్
తెలుగు చలనచిత్ర నటుడు రాహుల్ రామకృష్ణ తన సోదరుడి మరణంతో కలిగిన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ, అత్యంత ప్రమాదకరమైన 'పారాక్వాట్' (Paraquat) గడ్డి మందును తక్షణమే నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. పారాక్వాట్ వంటి ప్రాణాంతక రసాయనాలు మార్కెట్‌లో సులభంగా లభించడం వల్లే తన సోదరుడు దానిని సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇలాంటి విషాదాలు మరే కుటుంబంలోనూ జరగకూడదని ఆయన కోరారు.
పారాక్వాట్ అనేది వ్యవసాయంలో కలుపు నివారణకు వాడే రసాయనం అయినప్పటికీ, దీనికి విరుగుడు (Antidote) లేకపోవడం వల్ల ఇది ప్రాణాంతకంగా మారుతోంది. కేవలం కొన్ని మిల్లీలీటర్ల మందు శరీరంలోకి వెళ్లినా అంతర్గత అవయవాలు దెబ్బతిని మరణం సంభవిస్తుంది. ఈ ప్రమాద తీవ్రతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పారాక్వాట్ విక్రయాలపై కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టింది.
ఈ మందును విక్రయించేటప్పుడు కొనుగోలుదారుల వివరాలను నమోదు చేయాలని, అనధికారిక విక్రయాలు జరిపితే లైసెన్సులు రద్దు చేస్తామని డీలర్లను హెచ్చరించింది. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ నియంత్రణలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల దుర్వినియోగం జరుగుతోందని, అందుకే దీనిపై సంపూర్ణ నిషేధం విధించాలని సామాజిక కార్యకర్తలు మరియు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Honourable Sirs @TelanganaCMO @PMOIndia,Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽
— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026