ఎట్టకేలకు ఆ అభిమానిని కలిసిన నాగార్జున
ముంబై విమానాశ్రయంలో ఓ అభిమానిని అక్కినేని నాగార్జున బాడీగార్డులు తోసి వేశారు.
By Medi Samrat Published on 27 Jun 2024 12:00 PM ISTముంబై విమానాశ్రయంలో ఓ అభిమానిని అక్కినేని నాగార్జున బాడీగార్డులు తోసి వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ అభిమానిని నాగార్జున స్వయంగా కలిసి క్షమాపణలు చెప్పారు. తప్పు మీది కాదు.. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ ఆ అభిమానికి నాగార్జున వివరించారు.
శేఖర్ కమ్ముల "కుబేర" సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి నాగార్జున కొద్దిరోజుల కిందట ముంబైకి వెళ్లారు. విమానాశ్రయంలో ఒక అభిమాని ఆయనతో ఫోటో దిగడానికి ప్రయత్నించాడు. అయితే నాగార్జున అంగరక్షకుడు అతన్ని దూరంగా నెట్టేయడంతో.. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఎక్స్ లో నాగార్జున క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన జరిగినప్పుడు గమనించలేదని చెప్పుకొచ్చారు. తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని నాగార్జున ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇలాంటిది జరిగి ఉండాల్సి కాదని.. సదురు వ్యక్తిని తాను క్షమాపణలు చెబుతున్నా అంటూ నాగార్జున పోస్టు పెట్టారు.
నాగార్జున హైదరాబాద్‌కు తిరిగి రావడానికి విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న అదే అభిమానిని నాగార్జున పలకరించారు. తప్పు జరిగిందని.. ఇంతకు ముందు చోటు చేసుకున్న ఘటనలో నీ తప్పేమీ లేదని అభిమానితో చెప్పారు.