ప్రముఖ టాలీవుడ్ నిర్మాత జీవీజీ రాజు సతీమణి పద్మజా రాజు (54) గుండెపోటుతో కన్నుమూశారు. పద్మజా రాజు ఆకస్మిక మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పద్మజా రాజుకు ఇద్దరు కుమారులున్నారు. పద్మజా రాజు అలనాటి హీరో హరనాథ్ కూతురు కాగా.. ఆమె సోదరుడు శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే. పద్మజా రాజు ఇటీవలే తన తండ్రి హరనాథ్ పేరు మీద 'అందాల నటుడు' టైటిల్‌తో కృష్ణ చేతుల మీదుగా ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. పవన్ కల్యాణ్ హీరోగా తొలిప్రేమ, గోకులంలో సీత లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు పద్మజా రాజు భర్త జీవీజీ రాజు. దీంతోపాటు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన గోదావరి చిత్రాన్ని కూడా నిర్మించారు. త్వరలో తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కాబోతున్నాడని పద్మజా రాజు గతంలో చెప్పారు. 54 ఏళ్ల పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురయ్యారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.