ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సన్నిహితుడు అని పేర్కొంటూ.. తన ఆత్మహత్యకు రాజమౌళి కారణమని ఆరోపించారు. తాను 1990 నుండి రాజమౌళికి మిత్రుడని, ఒక మహిళ కారణంగా తమ మధ్య వివాదం తలెత్తిందని విడుదల చేసిన ఓ వీడియోలో తెలిపారు. ఆ మహిళ కోసం రాజమౌళి తన జీవితాన్ని నాశనం చేశాడని వీడియో పెట్టారు.
ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని శ్రీనివాసరావు ఓ లేఖ కూడా రాశారు. 55 ఏళ్ల వయసులోనూ తాను ఒంటరిగానే ఉండిపోడానికి రాజమౌళి కారణమని ఆరోపించారు. యమదొంగ వరకూ కలిసి పనిచేసినప్పటికీ ఓ మహిళ కోసం రాజమౌళి తన కెరీర్‌ను నాశనం చేయాలని నిర్ణయించుకున్నారని సంచలన వీడియోలో తెలిపారు. శాంతి నివాసం రోజుల నుండి రాజమౌళితో కలిసి పనిచేశానని ఇప్పుడు రాజమౌళి పెద్ద డైరెక్టర్ అయ్యి శాసించే స్థాయికి చేరుకున్నాడని శ్రీనివాస రావు అన్నారు. తాను ఈ విషయం ఎవరికైనా చెబుతానేమో అనే అనుమానంతో రాజమౌళి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.