జాతీయ చలనచిత్ర అవార్డులను ప్ర‌క‌టించిన కేంద్రం.. స‌త్తా చాటిన తెలుగు సినిమాలు

67th National Film Awards. క‌రోనా వ‌ల్ల గ‌త ఏడాది ప్ర‌క‌టించ‌ని 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం సోమ‌వారం ప్రకటించింది

By Medi Samrat
Published on : 22 March 2021 5:33 PM IST

67th National Film Awards

క‌రోనా వ‌ల్ల గ‌త ఏడాది ప్ర‌క‌టించ‌ని 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం సోమ‌వారం ప్రకటించింది. అయితే దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన చిచోరే సినిమాకు ఉత్త‌మ హిందీ చిత్రం అవార్డు ద‌క్కింది. మణికర్ణిక సినిమాలో నటనకు గానూ కంగనా రనౌత్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక ఉత్తమ నటుడు కేటగరీలో మనోజ్ బాజ్‌పాయ్, ధనుష్‌ను సంయుక్తంగా ప్రకటించారు. ఉత్తమ సహాయ నటుడిగా సూపర్ డిలాక్స్‌లో నటనకు గానూ విజయ సేతుపతి ఎంపికయ్యారు.

ఇక ఈ అవార్డుల‌లో తెలుగు సినీ పరిశ్రమ కూడా సత్తా చాటింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ' ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై గౌతమ్ తిన్ననూరి దీన్ని తెరకెక్కించారు. అంతేకాదు, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో 'జెర్సీ' చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్‌ నూలి అవార్డు దక్కించుకున్నారు. జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా మహర్షి సినిమాకు గానూ రాజు సుందరం ఎంపికయ్యారు. ఉత్తమ ప్రొడక్షన్ హౌస్ విభాగంలో మహర్షి సినిమా ఎంపికైంది. ఇక‌ జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా కస్తూరి ఎంపికవ‌గా.. ఇక ఉత్తమ సినిమాటోగ్రాఫి మూ‌వీగా 'జల్లికట్టు' (మలయాళం) చిత్రం దక్కించుకుంది.

ఇక‌ బెస్ట్ నాన్-ఫీచ‌ర్ ఫిల్మ్ అవార్డు యాన్ ఇంజ‌నీర్డ్ డ్రీమ్‌కు ద‌క్కింది. ఉత్త‌మ త‌మిళ చిత్రం అవార్డును అసుర‌న్ గెలుచుకున్న‌ది. ధనుష్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించారు. మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్‌గా సిక్కిం రాష్ట్రం గెలుచుకున్న‌ది. అలాగే.. అసుర‌న్ తీసిన వెట్రి మార‌న్ కు బెస్ట్ డైర‌క్ట‌ర్ అవార్డు ద‌క్కింది.


Next Story