పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 11:24 AM ISTజమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమవ్వగా.. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులున్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారు జామున పుల్వామా జిల్లాలోని కంరాజీపోరా ప్రాంతంలో భద్రతాదళాలు సోదాలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు తారసపడ్డారు. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.
దీంతో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ జవాన్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు మరణించాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మిగిలినవారు తప్పించుకున్నారని, వారికోసం గాలింపు కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు. మరణించిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందిన వాడనే విషయాన్ని గుర్తించాల్సి ఉందని భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఘటనాస్థలం నుంచి ఏకే-47 తుపాకీ, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.