ఆ ఇంటి కరెంటు బిల్లు రూ.6.67 లక్షలు.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 July 2020 2:25 PM GMT
తెలంగాణలో సామాన్య ప్రజలకు కరెంట్ బిల్లులు షాకిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్ పేట్.. పటేల్ నగర్‌లో బోనం వీరబాబు అనే వ్యక్తి ఇంటి కరెంట్ బిల్లు ఐదు నెలలకు గాను.. ఏకంగా రూ. 6.67 లక్షలు వచ్చింది. బిల్లు చూసిన యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంటి నెంబర్ 2-3/603/63/9, మీటర్ నెంబర్ V2074326.
వీరబాబు మాట్లాడుతూ.. బిల్లు చూసిన వెంటనే ఒకేసారి ప్రాణం పోయినంత పనైందని.. కరోనా కారణంగా అసలే ఆరు నెలలుగా పనులు లేక అల్లాడుతున్న వేళ.. లక్షలు లక్షలు బిల్లు వస్తే ఏ రకంగా చెల్లించాలని వాపోయాడు. తన ఇంటిని అమ్మేసి బిల్లు చెల్లించి.. మిగిలిన డబ్బులు తనకు ఇవ్వాలని అధికారులను కోరారు వీరబాబు.
గతంలో బిల్లులు ఎక్కువ రావడంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయనేది అనుమానం మాత్రమేనని అన్నారు. కరోనా విపత్తు కారణంగా సామాన్యుడికి బతుకు భారమైన వేళ ఇటువంటి సంఘటనలు మరింత కృంగదీస్తాయనడంలో సందేహం లేదు. ఈ విషయమై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.