మాస్కుతో మానవాళికి అంత డేంజరా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 July 2020 2:59 PM ISTముఖానికి మాస్కు పెట్టుకోవటం ఒకప్పుడు చాలా విచిత్రంగా చూసేవారు. ఆసుపత్రుల్లో వైద్యులు.. నర్సులు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. మాస్కు అన్నది మనిషి జీవితంలో భాగమైంది. ఒకప్పుడు ముఖానికి మాస్కు పెట్టుకుంటే విచిత్రంగా చూసేవారు. ఇప్పుడు ముఖానికి మాస్కు లేకపోతే విచిత్రంగా చూడటమే కాదు.. భారీ ఫైన్ పడే పరిస్థితి.
ఒకప్పుడు మెడికల్ షాపుల్లో మాత్రం కనిపించే మాస్కులు.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తున్నాయి. చివరకు సెల్ ఫోన్లు అమ్మే షాపుకు వెళ్లినా అక్కడ కూడా నాలుగైదు రకాల మాస్కులతో పాటు.. శానిటైజర్లు.. శానిటైజ్ మెషిన్లు దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన మాస్కుల వినియోగం ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా నెలకు దాదాపు పదికోట్ల మాస్కులు వాడుతున్నట్లు చెబుతున్నా.. వాస్తవంతో మరింత ఎక్కువగా వినియోగం ఉందన్న మాట వినిపిస్తోంది.
ప్రతి పదిమందిలో ఇద్దరు.. ముగ్గురు బయటకు వస్తున్నారన్న లెక్క వేసుకుంటే.. వీరంతా తప్పనిసరిగా మాస్కు లేనిదే బయటకు రావటం లేదు. అనుకోని రీతిలో ఇంటికి ఎవరైనా వస్తే.. మొన్నటివరకూ మాస్కు లేకుండా వాడుతున్న వారు.. ఇప్పుడు ఇంటికి కొత్తవాళ్లు వచ్చినంతనే ముఖానికి మాస్కు పెట్టేసుకుంటున్నారు.
ఇప్పటికున్న అవగాహనతో క్లాత్ మాస్కులు వాడుతున్నప్పటికీ.. ఎక్కువమంది మాత్రం మెడికల్ మాస్కుల్ని వాడుతున్నారు. వీటిని సింథటిక్ రేసిన్ తో వాడతారు. ఇందులో పాలిస్టిరిన్.. పాలికార్బనేట్.. పాలిథిలియన్ లాంటివి ఉంటాయి. వీటిని మట్టిలో పూడ్చి వేస్తే.. కలిసిపోవటానికి కనీసం వందేళ్లు పడుతుందని చెబుతున్నారు. దీంతో.. మాస్కు వ్యర్థాలు భూగోళానికి ఇప్పుడో సమస్యగా మారాయని చెప్పాలి. ఒక అంచనా ప్రకారం ఈ ఏడాదికి 130 బిలియన్ మాస్కుల వ్యర్థాలు సముద్ర జలాల్లోకి చేరేప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే సముద్ర జలాల్లో జెల్లీ ఫిష్ ల కంటే మాస్కుల వ్యర్థాలే ఎక్కువని చెబుతున్నారు.
వాస్తవానికి మాస్కుల్ని వాడిన తర్వాత 850 ఢిగ్రీల సెల్సియస్ నుంచి 1100 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రత్యేక గ్యాస్ క్లీనింగ్ ఎక్విప్ మెంట్ తో కాల్చివేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలు వాడిన మాస్కుల్ని ఇతర వ్యర్థాలతో కలపకూడదు. కానీ.. అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. సరైన పద్దతిలో మాస్కుల్ని నిర్వహణ ఎలా ఉండాలంటే వాడి పారేసిన మాస్కుల్ని కనీసం పది అడుగుల లోతున భూమిలో పాతి పెట్టాలి. మాస్కుల్ని రీసైక్లింగ్ చేయటం అసాధ్యమని చెబుతున్నారు. ఎందుకంటే.. మాస్కుల్ని రీస్లైక్లింగ్ చేసి మళ్లీ ఉత్పత్తి చేసేందుకు ఎంత ఖర్చు అవుతుందో.. అంతే మొత్తం కొత్త మాస్కు తయారీకి అవుతుందట. ఈ కారణంతోనే కొత్త మాస్కుల్ని తయారు చేయటమే మంచిదట.