తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు రాసే విద్యార్థులకు అలర్ట్. పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7 నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(TSCHE) తెలిపింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
వాస్తవానికి ఈ పరీక్షలు మే 7 నుంచి 9 వరకు జరగాల్సి ఉంది. అయితే మే 7న NET (UG) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ చేయడం, మే 7, 8 తేదీల్లో కొన్ని పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బావించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే.. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ల పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేనట్లు తెలిపింది. ఈ పరీక్షలు మే 10, 11 తేదీల్లో యథాతథంగా జరుగుతాయని చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కళాశాలలు అందించే వివిధ వృత్తిపరమైన కోర్సులలో ప్రవేశం పొందేందుకు TS EAMCET పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఏటా TSCHE నిర్వహిస్తుంది.