తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాల వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు వెల్లడించారు. అయితే ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు.
కాగా, వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే ప్రకటిస్తామని విద్యామండలి తెలిపింది. ఈసారి ఎంసెట్ ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్‌కు 1,71,945, అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150, రెండింటికీ దరఖాస్తు చేసినవారు 350, మొత్తం 2,66,445 దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయని అధికారులు చెప్పారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగంలో 109 కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలకు తెలంగాణలో 85, ఆంధ్రప్రదేశ్‌లో 24 సెంటర్లను ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈసారి 5 పరీక్షా కేంద్రాలను పెంచారు.