ఏపీ విద్యార్థులకు శుభవార్త.. మే 6 నుంచి వేసవి సెలవులు
May 6th to July 3rd Summer Holidays in AP.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By తోట వంశీ కుమార్ Published on 24 April 2022 11:09 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేసవి సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలో మే 6 నుంచి జులై 3 వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మే 4లోగా 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తిరిగి జూలై 4 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 3,780 పరీక్షా కేంద్రాల్లో 6,22,746 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు తమ హల్ టికెట్‌ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఇక విద్యార్థులకు సెలవులు ఇచ్చినా పాఠశాలలు మే 20 వరకు కొనసాగనున్నాయి. మే 20 వరకు టీచర్లు విధులకు హాజరవ్వాలి. పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనం, మార్కులు, ఇతర సమాచారం అప్‌లోడింగ్ తదితరాల దృష్ట్యా 20 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి.
మే 25 నుంచి ఇంటర్ విద్యార్థులకు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలు, కాంపోజిట్ డిగ్రీ కళాశాలలకు 2021–22 విద్యా సంవత్సరానికి సెలవులను ప్రకటించారు. మే 25 నుంచి జూన్ 19 వరకు వేసవి ఉండనున్నట్లు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎం.వి.శేషగిరిబాబు శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్ 20 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీలు ప్రారంభం అవుతాయన్నారు. కొన్ని కళాశాలలు వేసవి సెలవుల్లో కూడా పనిచేస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నేటీ(ఏప్రిల్ 24) నుంచే స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేసవి సెలవులు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి. మే 23 నుంచి జూన్ 1 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పాఠశాలలు జూన్ 13వ తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి.