తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ప్రభుత్వం ఒంటి పూట బడులు నిర్వహిస్తుండగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఒంటి పూట బడుల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రంలో ఈనెల 4 నుంచి పాఠశాలలు ఒక్కపూట మాత్రమే నడుస్తాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వేసవి దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 27 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను కరోనా నిబంధనలను పాటిస్తూనే నిర్వహించనున్నట్లు తెలిపారు.