తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు బీఆర్‌ఏఓయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఏవీఎన్ రెడ్డి సోమవారం తెలిపారు. కోవిడ్ -19 కేసుల పెరుగుదల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జనవరి 30 వరకు నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు డాక్టర్ రెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం.. www.braouonline.inలో చూడవచ్చు.
ఇదిలా ఉంటే.. ఉస్మానియా యూనివర్శిటీ జనవరి 17 నుండి 30 వరకు కళాశాలల సెలవులను పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి అన్ని విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయూ పత్రికా ప్రకటనలో తెలిపింది. సెలవుల నేఫథ్యంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఓయూ అడ్మినిస్ట్రేషన్ తమ పరిధిలోని కళాశాలల ప్రిన్సిపాల్‌లను ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి వారి ప్రదేశాలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.