తీవ్ర విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2020 9:31 AM GMT
తీవ్ర విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత‌

సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూసారు. తెలుగు, తమిళ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కోలా భాస్కర్.. కొన్నేళ్లుగా గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో నేడు ఆయన తుది శ్వాస విడిచారు.

తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో సినిమాలకు పని చేసిన‌ కోలా భాస్కర్ వయసు 55 సంవత్సరాలు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. గత కొద్దికాలంగా భాస్కర్ గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఈయన అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నాడు. ఆరోగ్యం కుదురుకున్న‌ది అనుకున్న స‌మ‌యంలోనే మళ్లీ విషమించడంతో నవంబర్ 4 ఉదయం 8 గంటలకు కోలా భాస్కర్ తుది శ్వాస విడిచారు.

ఇదిలావుంటే.. తెలుగులో కోలా భాస్కర్.. పవన్ కళ్యాణ్ హిట్ సినిమా ఖుషి, సెల్వ రాఘవన్ తెరకెక్కించిన 7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి విజ‌య‌వంత‌మైన‌ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసాడు. కోలా భాస్కర్ త‌న‌యుడు కోలా బాలకృష్ణ.. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ ద్విభాషా చిత్రంతో హీరోగా కూడా పరిచయమయ్యాడు. తెలుగులో 'నన్ను వదలి నీవు పోలేవులే' పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని కోలా భాస్కర్ నిర్మించాడు. కోలా భాస్కర్ మృతిపై తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story