డివిలియర్స్ విధ్వంసం.. ‘ఈగల్స్’ కు స్వర్ణం
By Medi Samrat Published on 19 July 2020 7:24 PM ISTకరోనా కారణంగా రద్దైన క్రికెట్‌ను మొదలు పెట్టేందుకు దక్షిణాఫ్రికా బోర్డు తీసుకొచ్చిన కొత్త ఫార్మాట్ 3టీమ్ క్రికెట్ (3టీసీ) సాలిడారిటీ కప్ మ్యాచ్ ఫలితం తేలింది. ‘నెల్సన్ మండేలా డే’ అయిన శనివారం రోజున ఈ టోర్నీ జరిగింది. డివిలియర్స్ నాయకత్వంలో ‘ఈగల్స్’, తెంబా బవుమా సారథిగా ఉన్న ‘కైట్స్’, రీజా హెన్‌డ్రిక్స్ కెప్టెన్‌గా ‘కింగ్‌ఫిషర్స్’ జట్లు బరిలోకి దిగాయి.
నిబంధనల ప్రకారం.. ప్రతీ జట్టులో గరిష్టంగా ఎనిమిది మంది ఆటగాళ్లే ఉంటారు. మూడు జట్లు కలిపి ఒకే సారి 36 ఓవర్ల ఈ మ్యాచ్‌లో తలపడతాయి. అయితే రెండు విడుతలుగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఒక్కో జట్టు 6 + 6 ఓవర్ల చొప్పున 12 ఓవర్లు ఆడుతుంది. ప్రతీ జట్టు తొలి భాగంలో ఒక ప్రత్యర్థిని.. రెండో భాగంలో మరో ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది. ఇక ఫీల్డర్లందరూ బౌండరీ లైన్ వద్ద ఉంటారు. చివరకు ఒక్కో జట్టు చేసిన మొత్తం పరుగులను బట్టి విజేతను నిర్ణయిస్తారు.
అయితే.. ఈ టోర్నీలో డివిలియర్స్ ‘ఈగల్స్’ జట్టు 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి స్వర్ణం గెలుచుకుంది. చాలీ రోజుల తర్వాత బరిలోకి దిగిన డివిలియర్స్ 24 బంతుల్లో 61 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇక 3 వికెట్లకు 138 పరుగులు సాధించిన కైట్స్‌కు రజతం, 5 వికెట్లకు 113 పరుగులు చేసిన కింగ్ ఫిషర్స్‌కు కాంస్య పతకం లభించాయి. ఇక దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న గాటెంగ్ ప్రావిన్స్‌లో ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో అక్కడ మ్యాచ్‌ను నిర్వహించారు.