దేశీయ అవసరాలే.. మా తొలి ప్రాధాన్యం
By Newsmeter.Network Published on 10 April 2020 4:49 PM ISTహైడ్రాక్సీ క్లోరోక్విన్.. ఇప్పుడు ఈ ఔషధం అందరికి సుపరిచితమే. కరోనా వైరస్ గురించి తెలిసిన వారందరికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. ఇటీవల ఈ హైక్రాక్సీ క్లోరోక్విన్ కోసం ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలని కోరారు. కరోనా నియంత్రణకు ఔషధంగా భావిస్తున్న దీని ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేయాలని ట్రంప్ కోరారు. కానీ భారత్ అవేవీ పట్టించుకోకపోవటంతో ట్రంప్ భారత్‌పై అసహనంసైతం వ్యక్తం చేశారు. అమెరికాతో పాటు, బ్రెజిల్, కొన్ని ఐరోపా దేశాలుసైతం తమకు ఈ ఔషధం కావాలని భారత్‌ను కోరాయి. దీంతో చివరికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై భారత్ ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. దీంతో ఇప్పుడు దేశ ప్రజల్లో ఓ ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. కరోనా నివారణకు ఔషధంగా భావిస్తున్న ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇతర దేశాలకు తరలిస్తే.. మన పరిస్థితి ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
Also Read :మాస్కుల తయారీ ఇలా – కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
దీంతో జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) చైర్మన్ శుభ్రాసింగ్ క్లారిటీ ఇచ్చారు. దేశీయ విపణికి సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. దేశీయ అవసరాలు, గిరాకీ, ఉత్పత్తిని రోజువారీగా సమీక్షిస్తున్నామని, దేశీయ అవసరాలే మా తొలి ప్రాధాన్యం అని తెలిపారు. మన అవసరాలు తీరాకే విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఐపీసీఏ, జైడస్ క్యాడీ వంటి సంస్థలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. కరోనా వైరస్ రాకుండా కొందరు హైడ్రాక్సీ క్లోరోకిన్ మందులను వాడుతున్నారు. వైద్యుల సూచనలు లేకుండానే పలువురు ఈ ఔషధం వాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం స్పందించింది. ఎవరైనా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు వాడాలంటే తప్పనిసరిగా వైద్యుడి సలహాలు పాటించాలని, వైద్యుల సూచనల మేరకే వాడాలని సూచిస్తుంది.