భయంగా ఉంది.. విధులు నిర్వహించలేం.. !
By సుభాష్ Published on 5 April 2020 9:45 AM ISTకరోనా కాటేస్తోంది. కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా వైద్యులతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ప్రాణాలతో పోరాటం చేస్తూ వైద్య చికిత్సలు అందిస్తుంటే మరో వైపు కరోనా వల్ల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే చేతులెత్తేయాల్సిన పరిస్థతి ఏర్పడింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో మాత్రం ప్రభుత్వ వైద్యలు ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కారోనా మహమ్మారి వల్ల మేము విధులు నిర్వహించేది లేదని ఏకంగా ఆరుగురు వైద్యులు రాజీనామా చేశారు. ఆస్పత్రిలో విధులు నిర్వహించేందుకు తమ కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదంటూ శనివారం రాజీనామా లేఖలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు అందజేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఐసీయులో విధులు నిర్వహిస్తున్న పల్మనాలజిస్టులు ప్రవీణ్‌కుమార్, నరేన్ కుమార్, ఫిజీషియన్‌లు సాయిలు, రవితేజ, వైద్యుడు రమణ, పిల్లల వైద్య నిపుణుడు ముత్యం నాగేందర్‌లు రాజీనామా సమర్పించిన వారిలో ఉన్నారు. వీరంతా కాంటాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ప్రైవేటు ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. దీంతో నిత్యం రోగుల తాకిడి కూడా ఎక్కువైపోయింది.
తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం..
ప్రతీ రోజు 300లకుపైగా రోగులు వస్తున్నారు. దీనికి తోడు కరోనా ఐసోలేషన్ వార్డులో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తుండటంతో తీవ్ర ఒత్తిడి గురవుతున్నామని వారు చెబుతున్నారు. అలాగే ఓపీకి కరోనా లక్షణాలున్నవారు కూడా వస్తున్నారని, వారు గుంపులు గుంపులుగా రావడంతో ఎవరికి కరోనా ఉందో తెలియని పరిస్థితి ఉందని, భయంతో విధులు నిర్వహించలేకపోతున్నామని వాపోతున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌వోలు రాజీనామా చేసిన వైద్యులతో మాట్లాడారు.
విధుల్లో చేరకపోతే చట్టపరమైన చర్యలు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులు రాజీనామా చేసినా, సెలవు పెట్టి వెళ్లినా వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ అజయ్‌కుమార్‌లు స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి విధులు చేరాలని కోరారు. ఒక వేళ విధుల్లో చేరకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.