రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని చటాన్ పల్లి శివారులో దారుణం జరిగింది. శంషాబాద్ కు చెందిన వెటర్నరీ డాక్ట‌ర్ ని గుర్తుతెలియ‌ని దుండ‌గులు దారుణంగా హ‌త్య‌చేశారు. యువతి పై పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా హ‌త‌మార్చారు.

స‌మాచారం అందిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ లు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వెటర్నరీ డాక్ట‌ర్ ను ఎక్క‌డో హ‌త్య చేసి శవాన్ని బ్రిడ్జి కింది త‌గ‌ల‌బెట్టార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

హ‌త్య గురైన వెటర్నరీ డాక్ట‌ర్ ది శంషాబాద్. వీరి సొంత గ్రామం కొల్లాపూర్ స‌మీపంలోని నర్సాయపల్లి. గ్రామం నుండి వ‌చ్చేసిన వీరి కుటుంబం శంషాబాద్ లో నివాసం ఉంటున్నారు. కూతురు మ‌ర‌ణ‌వార్త తెలియ‌డంతో ఆమె తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వెట‌ర్న‌రీ వైద్యురాలుపై ఎందుకు పెట్రోలు పోసి తగలబెట్టారు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 15 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను పట్టుకుంటామ‌ని పోలీసు అధికారులు తెలిపారు.

ఘ‌ట‌న‌కు ముందు బుధ‌వారం వెట‌ర్న‌రీ వైద్యురాలు ట్రీట్‌మెంట్ కోసం మాదాపూర్‌లోని హాస్పిట‌ల్‌కు వెళ్లింది. మార్గ‌మ‌ధ్యంలో స్కూటీ పాడ‌వ‌టంతో.. కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ చేసి చెప్పింది. స్కూటీ ఆగిన ప్రాంతంలో లారీ డ్రైవ‌ర్లు ఉన్నార‌ని ఫోన్ లో కుటుంబ స‌భ్యుల‌కు తెలిపింది. ఆ త‌ర్వాత కుటుంబ స‌భ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసిన క‌ల‌వ‌లేదు. తీరా చూస్తే ఈ రోజు ఉద‌యం కుటుంబ స‌భ్యులు ఆమె మ‌ర‌ణ వార్త వినాల్సివ‌చ్చింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.