తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ వైద్యురాలు హత్య కేసు సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి ప్రముఖల  వరకు ఈ అంశంపై ఖండిస్తున్నారు. ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రతిఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వెటర్నరీ వైద్యురాలి హత్య కేసు నిందితుకుల ఉరి శిక్ష పడేలా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని బాధిత కుంబానికి భరోసా ఇచ్చారు. అలాగే బ్రిటీష్ కాలంలో రూపొందించిన చట్టాలకు త్వరలోనే మార్పులు చేయనున్నట్లు చెప్పారు.

బాధితులకు సత్వర న్యాయ పరిష్కారం లభించే విధంగా ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. చాలా కేసుల్లో ట్రయల్ కోర్టులు విధించిన తీర్పులను హైకోర్టులో సవాల్ చేస్తున్నారని, ఇకనుంచి అలాంటి సమస్యల లేకుండా చేయనున్నట్లు వివరించారు. ట్రయల్ కోర్టులో ఇచ్చిన తీర్పును మధ్యలో మరో కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకుండా ఏకంగా సుప్రీంకోర్టులోనే తేల్చుకునేలా చట్టాలలో మార్పులు తీసుకురానున్నట్లు  చెప్పారు. ఈ విషయమై ఎల్లుండి లోక్‌సభలో కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. అలాగే ఐపీసీ, సీఆర్‌పీసీలో ఎలాంటి సవరణలు చేయాలో సలహాలు కోరుతామన్నారు. ఫోక్సో చట్టం వల్ల నిందితులకు సత్వరమే శిక్షలు పడుతున్నాయన్నారు. నిందితులకు శిక్ష పడేందుకు రాష్ట్ర పోలీసులకు సహకారం అందిస్తామన్నారు. గుజరాత్ లో రాత్రి వేళ లో సైతం మహిళలు ఒంటరిగా తిరుగుతారని, ఆ పరిస్థితి దేశ వ్యాప్తంగా రావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు తమను తాము కాపాడుకునేందుకు 112 ప్రత్యేక యాప్‌లను రూపొందించామని అన్నారు. ఈ యాప్‌ను ప్రతీ మహిళా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్