ముఖ్యాంశాలు

  • కార్మిక నేతలు కూడా విధులు నిర్వర్తించాల్సిందే: ఆర్టీసీ యాజమాన్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా టీఎంయూ కార్యాలయాలకు తాళాలు
  • విధుల నుంచి మినహాయింపు రద్దును విమర్శించిన అశ్వత్థామరెడ్డి
  • రేపు ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ సమావేశం
  • సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా విధులు నిర్వర్తించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ కార్మికుల మాదిరి విధులు నిర్వహించాలని, ఇప్పటి దాకా వారికి కల్పించిన విధుల నుంచి మినహాయింపు హక్కలను రద్దు చేసింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో పాటు మిగిలిన నేతలంతా కూడా విధుల్లోకి చేరాలని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఒకవేళ కార్మిక నేతలు విధులకు హాజరుకాకపోతే.. గైర్హాజరుగా పరగణిస్తామని తెలిపింది.

రాష్ట్రంలో 30 మంది ఆర్టీస కార్మిక నేతలకు విధుల నుంచి మినహాయింపు ఉంది. అధికారిక కార్మిక సంఘం తెలంగాణ మజ్దూరు యూనియన్‌లోనే 26 మంది కార్మిక నేతలు ఉన్నారు. మరోవైపు బస్సు భవన్‌లోని టీఎంయూ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎంయూ కార్యాలయాలకు తాళాలు వేశారు. సమ్మె నేపథ్యంలో టీఎంయూ కార్యాలయాకుల తాళాలు పడినట్లుగా తెలుస్తోంది. అధికారిక సంఘానికి ప్రభుత్వం కార్యాలయం కేటాయించటం గత కొన్నేళ్లు వస్తోంది.

ఇదిలా ఉంటే యూనియన్‌ సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి చెక్‌ పెట్టేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కార్మిక నేతలకు ఇస్తున్న విధుల నుంచి మినహాయింపును తొలగించడాన్ని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇది చిల్లర చర్య అని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. యూనియన్ నేతలమంతా విధుల్లోకి వెళ్తామని, నేడు డ్రైవర్‌ డ్యూటీ చేస్తానని అశ్వత్థామరెడ్డి తెలిపారు. విధుల నుంచి మినహాయింపుపై కార్మికశాఖ కమిషనర్ వద్ద తేల్చుకుంటామని, యూనియన్లు ఉండాలా? వద్దా? అనే విషయాన్ని లేబర్ కోర్టే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ సమావేశం..

రేపు ఆర్టీసీ కార్మికులతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులు, ఐదుగురిలో విధిగా ఇద్దరు మహిళ సిబ్బంది ఉండాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల నుంచి కార్మికులు హాజరుకావాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మను ప్రభుత్వం ఆదేశించింది.

గురువారం రోజున కేబినెట్‌లో భేటీలో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కాపాడాటానికి ప్రభుత్వం తరఫున అన్నిచర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినందుకు పువ్వాడ అజయ్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.