కేసీఆర్ వ‌ల్లే బ్రాందీ హైద‌రాబాద్‌గా మారింది

By సుభాష్  Published on  12 Dec 2019 10:44 AM GMT
కేసీఆర్ వ‌ల్లే బ్రాందీ హైద‌రాబాద్‌గా మారింది

తెలంగాణ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష‌ను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు దీక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి. రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను నియ‌త్రించి, ద‌శల‌వారీగా పూర్తి స్థాయిలో నిషేధించాల‌ని డిమాండ్ చేశారు. ఈ దీక్ష‌లో ఇటీవ‌ల అసిఫాబాద్ జిల్లాలో హ‌త్యాచారానికి గురైన స‌మ‌త భ‌ర్త‌, అత్త‌, పిల్ల‌లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ.. రాజ‌కీయ కార‌ణాల‌తో దీక్ష చేప‌ట్ట‌లేద‌ని, కేసీఆర్‌, కేటీఆర్ వ‌ల్లే బ్రాండ్ హైద‌రాబాద్ కాస్త బ్రాందీ హైద‌రాబాద్ గా మారింద‌ని అన్నారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ‌గా మార్చేశార‌ని, మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తుల ద్వారానే ప్ర‌భుత్వానికి రూ.980 కోట్ల ఆదాయం వ‌చ్చింద‌న్నారు. రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా ఎన్నో దారుణాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. మ‌ద్యం వ‌ల్ల ఎన్నో కుటుంబాలు నాశ‌నం అవుతున్నా.. మ‌ద్యం అమ్మ‌కాలు ఇంకా పెంచుకుంటుపోతున్నార‌ని, సీఎం కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మ‌ద్యం మ‌త్తులో ముంచుతున్నార‌ని మండిప‌డ్డారు. అర్ధ‌రాత్రి వ‌ర‌కు రాష్ట్రంలో మ‌ద్యం అమ్మకాల‌కు ప్రోత్స‌హిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మ‌ద్యం నిషేధించాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు ఉధృతం చేస్తామ‌ని, ప‌ల్లెల్లో బెల్టు షాపుల‌ను ధ్వంసం చేయాల‌ని మ‌హిళా మోర్చా కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిస్తున్నామ‌ని ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు.

Next Story