గ్యాంగ్ రేప్ నుండి ఎన్‌కౌంటర్ దాకా.. ఏం జరిగిందంటే..
By అంజి
దేశ వ్యాప్తంగా దిశ హత్య సంచలనం..
హైదరాబాద్: దిశ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ హత్య ఘటన నిందితులను ఉరితీయాలి మహిళలు, ప్రజాసంఘాలు తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 27వ తేదీన తొండుపల్లి దగ్గరలోని టోల్‌ప్లాజా పక్కన దిశ స్కూటీని పార్క్ చేయడం నలుగురు నిందితులు చూశారు. సాయంత్రం బైక్ తీసుకుపోవడానికి వస్తుందని గమనించారు. ఆమె ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని నిందితులు స్కూటీ పంక్చర్ చేశారు. దిశ బైక్ కోసం తిరిగి వచ్చేలోపు అప్పటికే నిందితులు మద్యం సేవించారు.
స్కూటీ పంక్చర్ కావడంతో ఆమె ఒంటరిగా ఉండిపోయింది. అదే సమయంలో దిశ తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడింది. అప్పటికే సమయం రాత్రి 9:30 దాటింది. ప్లాన్ ప్రకారం దిశను టోల్‌ప్లాజా పక్కన ఉన్న.. ఖాళీ ప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లారు. దిశ అరవకుండా ముక్కు, నోరు గట్టిగా నొక్కిపట్టారు. అనంతరం ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. మృతురాలి శవాన్ని ఎవరికి అనుమానం రాకుండా లారీలో తీసుకుని వెళ్లారు. మధ్యలో ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి బాటిల్‌లో పెట్రోల్ తీసుకున్నారు. తెల్లవారుజూమున చటాన్‌పల్లి శివారులో బ్రిడ్జి కింద పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనుమానంతో రెండు గంటల తరువాత నలుగురు మరోసారి వచ్చి.. శవం కాలిందా.. లేదా..? అని చూశారు.
దిశ ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులంతా నారాయణపేట జిల్లా, జక్లేర్ మండలం, మక్తల్‌కు చెందినవారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డది జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట్ల చెన్నకేశవులు, మహ్మద్ పాషా లుగా పోలీసులు గుర్తించారు. నవంబర్ 28 గురవారం మధ్యాహ్నం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పార్లమెంట్‌లో దిశ ఘటనపై చర్చ
నవంబర్ 29న శుక్రవారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నిందితులను పోలీసులు విచారించారు. నవంబర్ 30 శనివారం నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. డిసెంబర్ 4 బుధవారం నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. డిసెంబర్ 5న గురువారం చర్లపల్లి జైలులో నిందితులను సిట్ విచారించింది. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దిశ హత్య ఘటను సీరియస్‌గా తీసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరింది. దీనికి హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో కూడా దిశ హత్య కేసుపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. చట్టాలను సవరణకు కూడా కేంద్రప్రభుత్వం సిద్ధమైనట్లు తెలసుస్తోంది. కాగా నిందితులను నుంచి క్లూస్ టీమ్ కీలక ఆధారాలను సేకరించింది. పోలీసులు సూపర్ లైట్‌ను ఉపయోగించి లారీ క్యాబిన్‌లో రక్తపు మరకలను గుర్తించారు. కాగా రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషించనున్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు లభించనున్నాయి.
దిశకు న్యాయం
శుక్రవారం తెల్లవారుజామున సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో దిశను కాల్చిన చోటే నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ మృతి చెందారు. తెల్లవారు జామున 3.30 గంటలకు నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్టుగా తెలసుస్తోంది. ఎన్‌కౌంటర్ స్థలాన్ని సబరాబాద్ సీపీ సజ్జనార్ పరీశిలించారు. అయితే ఎన్‌కౌంటర్ వివరాలను మాత్రం పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. శుక్రవారం అర్థరాత్రి 2 గంటలకు నిందితులను చర్లపల్లి జైలు నుంచి అత్యంత రహస్యంగా చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తరలించారు. అత్యచారం జరిగిన ప్రదేశంలో నిందితులు పాతి పెట్టిన దిశ మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల వద్ద ఉన్న తుపాకులను నిందితులు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఆత్మరక్షణ కోసం నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు.