హైదరాబాద్ ప్రముఖుల్ని వణికిస్తున్న వజ్రాల వ్యాపారి బర్త్ డే పార్టీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 10:56 AM IST
హైదరాబాద్ ప్రముఖుల్ని వణికిస్తున్న వజ్రాల వ్యాపారి బర్త్ డే పార్టీ

మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. పార్టీలు.. ఫంక్షన్లపై ప్రభుత్వం పరిమితులు విధించింది. పెళ్లిళ్లు లాంటివాటినే యాభై మందితో ముగించాలని పేర్కొంది. అయినప్పటికీ ప్రభుత్వం మాటను పట్టించుకోకుండా వనస్థలిపురంలోని ఒక వ్యాపారి నిర్వహించిన బర్త్ డే ఫంక్షన్ ఎంతలా రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పార్టీకి హాజరైన వారిలో 29 మంది పాజిటివ్ కావటం అప్పట్లో సంచలనమైంది. ఇలా పుట్టినరోజులు.. కుటుంబ వేడుకులకు హాజరైన ఉదంతాల్లో పెద్ద ఎత్తున పాజిటివ్ ల బారిన పడటం తెలిసిందే. అందుకే.. వీలైనంతవరకు పార్టీలు.. కుటుంబ వేడుకులకు దూరంగా ఉండాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

ఇంత జరిగిన తర్వాత కూడా కొందరు ఇలాంటి ఉదంతాల్ని పట్టించుకోకుండా పార్టీలు నిర్వహిస్తున్నారు. తాజాగా అలా జరిగిన ఒక పార్టీ హైదరాబాద్ లో సంచలనమే కాదు.. ప్రముఖుల్లో కొత్త కలకలానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. వజ్రాల వ్యాపారి ఒకరు నిర్వహించిన పుట్టినరోజు ఫంక్షన్ హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం.. ఈ పార్టీ ఏర్పాటు చేసిన వజ్రాల వ్యాపారి పాజిటివ్ తో మరణించటం కలకలం రేపుతోంది. ఈ పార్టీకి పలువురు ప్రముఖులతో పాటు.. ఇద్దరు మంత్రులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. తాను అన్ని జాగ్రత్తలతోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పిన సదరు వజ్రాల వ్యాపారి.. మహమ్మారి గురించి ఆలోచించకుండా పార్టీని ఎంజాయ్ చేయాలని ప్రోత్సహించినట్లు చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబరు 5కు చెందిన వజ్రాల వ్యాపారి తన 63వ పుట్టినరోజు వేడుకల్ని జూన్ 25న నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంలో ఇద్దరు మంత్రులతో సహా పలువురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. జ్యువెలరీ అసోసియేషన్ కు చెందిన ప్రముఖులు మొత్తంగా నూటయాభై మంది వరకు హాజరయ్యారని చెబుతున్నారు.

పార్టీలో పాల్గొన్న రెండురోజులకే సదరు వ్యాపారి దగ్గు.. ఆయాసంతో బాధ పడుతూ ఒక ఆసుపత్రికి వెళ్లారు. మందులు వాడిన వ్యాపారి.. ఎంతకూ తన ఆరోగ్య సమస్య తగ్గక.. పెరగటంతో ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్ లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాతి రోజే మరణించారు. ఈ వేడుకలకు హాజరైన జువెలరీ అసోసియేషన్ ప్రతినిధి కూడా మహమ్మారి బారిన పడి మరణించారు.

తాజాగా ఈ పార్టీకి హాజరైన వారిలో 20 మంది పాజిటివ్ గా తేలినట్లు చెబుతున్నారు. దీంతో.. ఈ పార్టీకి హాజరైన పలువురు ప్రముఖులు హడలెత్తిపోతున్నారు. పలువురు తమ పేర్లతో కాకుండా.. మారు పేర్లతో పరీక్షలు చేయించుకొని.. రిజల్ట్ కోసం టెన్షన్ గా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వజ్రాల వ్యాపారి పుట్టినరోజు వ్యవహారం పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోందని చెప్పక తప్పదు.

Next Story