Fact Check : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోయారంటూ వదంతులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 12:11 PM IST
Fact Check : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోయారంటూ వదంతులు..!

భారతదేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉందని బుధవారం డాక్టర్లు చెప్పారు. ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిపారు.

ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాల్లో ఆయన చనిపోయారంటూ వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోయారంటూ వాట్సప్ లో మెసేజీలను ఫార్వర్డ్ చేస్తున్నారు. 'మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత.. ఓం శాంతి.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు.. కొద్ది సమయం క్రితమే ఢిల్లీ కంటోన్మెంట్ లో ఉన్న ఆర్మీ రెఫరల్ ఆసుపత్రిలో కన్నుమూత' అంటూ మెసేజీలను పంపుతూ ఉన్నారు.

Pranab

ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఆ తర్వాత డిలీట్ చేశారు.

Raj

నిజ నిర్ధారణ:

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'

ఆగష్టు 13న అందిన రిపోర్టుల ప్రకారం మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచారు.

84 సంవత్సరాల ప్రణబ్ ముఖర్జీ తనకు కరోనా వైరస్ సోకిందని ట్వీట్ చేశారు. ఆయన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ ఈ నెల 10వ తేదీన చేరారు. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్‌–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం తెలిపింది.

ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తన తండ్రి చనిపోయాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. 'నా తండ్రి బ్రతికే ఉన్నారు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన మరణం మీద వస్తున్న వదంతులను నమ్మకండని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్ న్యూస్ ను అసలు పట్టించుకోకండి అని' అన్నారు.

ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఈ వ్యాఖ్యలను ఖండించారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని.. ఆ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, తమ తండ్రి కోలుకుంటున్నారని ట్విటర్‌లో వెల్లడించారు. తమ తండ్రి అనారోగ్యంపై వచ్చే వార్తలు ఆసత్యమని, ముఖ్యంగా మీడియా గమనించాలని తెలిపారు.



ఆర్.ఆర్.ఆసుపత్రి కూడా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు రాలేదని తెలిపింది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారని తెలిపింది.

రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా తాను ఫేక్ న్యూస్ ను నమ్మానని.. అందుకు తనను క్షమించాలంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'నిజం లేదు'.

Next Story