రెండు రాజధానుల మధ్య బస్సు ప్రయాణం.. టికెట్ ధర రూ.15లక్షలేనట..!
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2020 11:30 AM ISTఏంటీ..? బస్ టికెట్ ధర రూ.15లక్షలా..! వామ్మో అంత రేటా అని ఆశ్చర్య పోకండి. అంత రేటు పెట్టి ఎవరైనా ఎక్కుతారా అన్న సందేహాం మీకు రావచ్చు. కానీ ఇది నిజంగా నిజం. మరీ బస్సు ప్రయాణించేది దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వరకు బయలు ఈ బస్సు వెళ్లనుంది. అంతదూరం బస్సులో ప్రయాణమా అని మళ్లీ ఆశ్చర్యపోకండి. ఇది మామూలు ప్రయాణం కాదు. సాహస యాత్ర. 18 దేశాల మీదుగా 70 రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో 20వేల కి.మీ ప్రయాణించొచ్చు. ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది గురుగ్రామ్‌కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ. కాగా.. ఈ ప్రయాణానికి టికెట్ ధరను రూ. 15 లక్షలుగా నిర్ణయించింది.
యాత్రలో భాగంగా మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ప్రయాణం సాగుతుంది. కాగా.. ఈ బస్సులో 20 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. ఈ జర్నీ కోసం ఇద్దరు డ్రైవర్లు, ఒక గైడ్, ఒక సహాయకుడు ఉంటారు. ఇక ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎటుంవంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులో ప్రయాణం చేయాలనుకునే వారికి అవసరమైన అన్ని వీసా వ్యవహారాల్ని ట్రావెల్స్ సంస్థే చూసుకోనుంది. అసలు ఈ ప్రయాణం ఈ మే 21న నే ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఎవరైనా ప్రయాణీకులు లండన్ వరకు కాకుండా.. తాము కోరుకున్న దేశం వరకు మాత్రమే జర్నీ చేయాలన్నా కూడా.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అక్కడి వరకు మాత్రమే టికెట్ ధర ఉంటుందని చెబుతున్నారు. మరీ ఈ సాహస యాత్ర చేయడానికి ఎంత మంది వస్తారో చూడాలి మరీ..!