అప్పట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులోకి కోహ్లీని ఎందుకు తీసుకోలేదంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2020 7:49 PM IST
అప్పట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులోకి కోహ్లీని ఎందుకు తీసుకోలేదంటే..!

2008 లో భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ ను నెగ్గినప్పటికే విరాట్ కోహ్లీ స్టార్ అయ్యాడు. సెలెక్టర్లు అతడి ఆటతీరును గమనిస్తూ వస్తున్నారు. అండర్-19 జట్టు కెప్టెన్ గా భారత్ కు వరల్డ్ కప్ ను అందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటిసారి వేలంపాట మొదలైనప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు లోకల్ బాయ్ అయిన విరాట్ కోహ్లీని ఖచ్చితంగా సొంతం చేసుకుంటుందని భావించారు. కానీ డీడీ జట్టు పేసర్ ప్రదీప్ సంగ్వాన్ ను తీసుకుంది కానీ.. విరాట్ కోహ్లీని తీసుకోలేకపోయింది.

ఆ తర్వాత విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకుంది. విరాట్ కోహ్లీ నేటి తరం గొప్ప బ్యాట్స్‌మెన్‌ గా ఎదిగాడు. అటు ఐపీఎల్ లోనూ, ఇటు ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. మొదటి ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ విరాట్ కోహ్లీని తీసుకోకుండా పెద్ద తప్పే చేసిందని ఇప్పటికే ఎంతో మంది అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై ఐపీఎల్ మాజీ సివొవొ సుందర్ రామన్ స్పందించాడు. మొదటి సారి వేలంపాట జరిగిన సమయంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో అప్పటికే బ్యాట్స్‌మెన్ లు ఎక్కువ అయిపోయారట.. ఇక చేసేదేమి లేక బౌలర్ ను తీసుకుందట ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం. ఐపీఎల్ వేలంపాటకు ఒక్క నెల ముందు అండర్-19 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది.

అండర్ 19 ఆటగాళ్లకు సెపరేట్ డ్రాఫ్ట్ ఉంచారు. అందులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఢిల్లీ యాజమాన్యం విరాట్ కోహ్లీని తీసుకోకుండా ప్రదీప్ సంగ్వాన్ ను తీసుకుంది. తమకు బ్యాట్స్‌మెన్ అవసరం లేదని.. బౌలర్ ను తీసుకోవాలని భావించింది. అప్పటికే ఢిల్లీ జట్టులో వీరేందర్ సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ లాంటి బ్యాట్స్‌మెన్ లు ఉండడంతో వారు కోహ్లీని తీసుకోడానికి ఆసక్తి కనబరచలేదు. కానీ ఆర్సీబీ కోహ్లీని సొంతం చేసుకుంది.. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే అని గౌరవ్ కపూర్ కు ఇచ్చిన పోడ్ కాస్ట్ లో సుందర్ రామన్ చెప్పుకొచ్చాడు.

169 ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 5412 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు. సంగ్వాన్ 39 మ్యాచ్ లలో 35 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. డోప్ టెస్ట్ లో ఫెయిల్ అయినందుకు సంగ్వాన్ కు బిసిసిఐ 15 నెలల బ్యాన్ ను విధించింది. 2011 లో ఢిల్లీ జట్టును సంగ్వాన్ వదిలిపెట్టిన తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు.

Next Story