ఢిల్లీలో మహిళతో రెండుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

By సుభాష్  Published on  14 March 2020 6:12 AM GMT
ఢిల్లీలో మహిళతో రెండుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

ఢిల్లీలో 69 ఏళ్ల మహిళ కరోనావైరస్‌తో మరణంతో భారత్‌లో కరోనావైరస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది. పశ్చిమ దిల్లీకి చెందిన ఈ మహిళ రామ్‌మనోహర్ లోహియా హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం.

ఇక దేశంలో ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 84కు చేరింది. బెంగళూరులో హైఅలెర్ట్‌ ప్రకటించారు. కరోనా భయంతో కేరళ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. విమానాలు రద్దు కావడంతో ఇరాన్‌ నగరమైన క్వామ్‌లో చిక్కుకుపోయిన 44మందిని శుక్రవారం భారత్‌ తరలించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు వెయ్యిమందికి పైగా తరలించినట్లు చెప్పారు. కర్ణాటక లో కరోనా తో మృతి చెందిన వ్యక్తితో సంబంధాలున్న మరో 31మందిని ఇళ్లకే పరిమితం చేశామని, వారిని ఇప్పుడు ప్రభుత్వ ఇఎస్ఐ ఆస్పత్రికి మారుస్తున్నామని స్థానిక అధికారులు చెప్పారు.

ఆ వృద్ధునికి చికిత్సనందించిన నలుగురు నిపుణులు కూడా హై రిస్క్‌ గ్రూపులోనే వున్నారని, ఆ వృద్ధునితో ఏదో ఒక రకంగా సంబంధాలు కలిగి వుంటారని అనుమానించిన మరో 15మందిని కూడా ఇఎస్ఐలోని ఐసొలేట్‌ వార్డులో వుంచినట్లు చెప్పారు. బెంగళూరులో 14 నుండి వారం రోజుల పాటు మాల్స్‌, పబ్‌లు, థియేటర్లు మూసివేశారు. సభలు సమావేశాలు, వివాహ కార్యక్రమాలు, సమ్మర్‌ క్యాంప్స్‌, కాలేజీలు, స్కూళ్లు కూడా మూసివేస్తున్నట్లు సిఎం యడ్యూరప్ప తెలిపారు..

అయితే ప్రస్తుతం భారత్‌లో 81 కరోనావైరస్ కేసులు నిర్థరణ కాగా వీరిలో కేరళకు చెందిన ముగ్గురు పూర్తిగా కోలుకుని హాస్పటల్ నుంచి విడుదలయ్యారు. దిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న మరో ఏడుగురు కోలుకున్నారని అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం 37 అంతర్జాతీయ చెక్ పోస్టుల్లో కేవలం 19 చెక్ పోస్టుల ద్వారానే రవాణాను అనుమతించాలని నిర్ణయించింది. ఇది కేవలం స్క్రీనింగ్‌ను సమర్థంగా చేయడం కోసమే. దీంతోపాటు, సరిహద్దులు దాటి ప్రయాణించే రైళ్లను కూడా నిలిపివేస్తున్నామని ఆరోగ్య శాఖ ప్రతినిధి వెల్లడించారు.

బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్‌లతో భారత్‌కు ఉన్న అంతర్జాతీయ సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి ప్రయాణికుల రాకపోకలను మార్చి 15 నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఢిల్లీ లోని నొయిడాకు చెందిన ఒక ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగికి వైరస్‌ పాజిటివ్‌ అని రావడంతో వెంటనే దాదాపు 700మంది ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయమని ఆదేశించారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నారు. ఘజియాబాద్‌లో 27 ఏళ్ల యువకుడికి కూడా ఈ వైరస్‌ సోకింది. అతని తండ్రి ఇరాన్‌, దుబారుల్లో పర్యటించి భారత్‌ వచ్చాడని వెల్లడైంది. దాంతో ఆ యువకుడిని కూడా ఐసొలేషన్‌ వార్డులో వున్నారు.

కరోనా వైరస్‌ కారణంగా దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలని ట్విట్టర్‌ ఆదేశించింది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ట్విట్టర్‌ సరిగా అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. జపాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేసియా, ఇండోనేషియాలతోపాటు భారత్‌లో ట్విట్టర్‌ ఓపెన్‌ అవని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. డస్క్‌టాప్‌ల్లో 85 శాతం మందికి, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 8 శాతం మందికి ట్విట్టర్‌ అందుబాటులోకి రాలేదు.



Next Story