మద్యం అమ్మకాలపై నేడు కీలక నిర్ణయం..!
By సుభాష్ Published on 15 April 2020 8:47 AM ISTకరోనా వైరస్ కారణంగా ఒక వైపు లాక్‌డౌన్ కొనసాగుతుందటే మరో వైపు మద్యం లేక మందుబాబులు పడరాని కష్టాలు పడుతున్నారు. మద్యం లేనిదే బతుకు బండి ముందుకు నడవడం లేదు. లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్క కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరి కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
ఇక ప్రధాని నరేంద్రమోదీ మే 3 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంపూర్ణ మద్దతు పలికారు.
బుధవారం నుంచి లాక్‌డౌన్ కఠినంగా అమలు కానుంది. కర్ణాటక ముఖ్యమంత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ ఇచ్చిన సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటిస్తామని, అలాగే రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలపై నిర్ణయం తీసుకుని విక్రయిస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం కూడా మద్యం అమ్మేందుకు ముందుకొచ్చినట్లు సంబంధిత అధికారుల ద్వారా సమాచారం. మద్యం లేక మందుబాబులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. మద్యం అమ్మే విధంగా చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. మరి నిజంగానే మద్యం విక్రయాలు కొనసాగించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది ఈ రోజు తేలిపోనుంది.
రాష్ట్రంలో ఉన్న హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మరింత పకడ్బందీ చేస్తామన్నారు. ప్రధాని చెప్పిన ఏడు సూత్రాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని యడ్యూరప్ప సూచించారు.భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఇంట్లోనే మాస్కులను సిద్దం చేసుకోవాలని అన్నారు. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర వస్తువులను సైతం సరఫరా చేస్తామన్నారు.
రాష్ట్రంలో 57వేలకుపైగా వాహనాలు సీజ్
ఇక లాక్‌డౌన్ కఠినంగా కొనసాగుతున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన 57,633 వాహనాలను సీజ్ చేశామని, 2,185 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని సీఎం యడ్యూరప్ప తెలిపారు. అంతేకాదు రూ.95 లక్షల వరకూ జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. ఎవ్వరు కూడా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని, లేకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. కరోనాను కట్టడి చేయాలంటే ఇంట్లోనే ఉండాల్సిందేనని అన్నారు.