బంజారాహిల్స్‌: సంచిలో వృద్ధురాలి మృతదేహం

By సుభాష్  Published on  30 Aug 2020 10:17 AM GMT
బంజారాహిల్స్‌: సంచిలో వృద్ధురాలి మృతదేహం

బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రోడ్‌ నెంబర్‌ 2లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని ఓ సంచిలో దుప్పటితో చుట్టి పడేసి వెళ్లారు. చనిపోయిన వృద్ధురాలి శవాన్ని సంచిలో పడేసి వెళ్లడంతో కొందరికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించడంతో వృద్ధురాలి మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఈ సందర్భంగా బంజారాహిల్స్‌ సీఐ కలింగరావు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక సంచిలో మృతదేహం చుట్టి పడేశారని 100 డయల్‌ ద్వారా కాల్‌ వచ్చింది. వెంటన పోలీసు బృందాలతో వెళ్లి చూడగా, సుమారు 72 ఏళ్ల వృద్ధురాలు మృతదేహం గుర్తించాము. ఆ వృద్దురాలు సమీపంలోని ఓ మజీద్‌ వద్ద భిక్షాటన చేస్తున్నట్లు తెలిసిందని ఆయన వివరించారు.

అయితే వృద్దురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. కరోనా వచ్చి చనిపోతే ఆమె మృతదేహాన్ని పడేసి ఉంటారని అనుమానం వస్తోందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు చెప్పారు. రద్దీగా ఉండే ప్రాంతం ఉండటంతో ఎవరు పెద్దగా గమనించి ఉండరనే ఉద్దేశంతో వృద్ధురాలి మృతదేహాన్ని పడేసి ఉంటారని అన్నారు. అక్కడి సీసీ పుటేజీని పరిశీలిస్తున్నామని అన్నారు. ఐపీసీ సెక్షన్ 174 అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Next Story
Share it