రైనా స్థానంలో మలన్..!
By తోట వంశీ కుమార్ Published on 11 Sep 2020 7:32 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ నుంచి వ్యక్తి గత కారణాలతో చెన్నై ఆటగాడు సురేష్ రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రైనా స్థానంలో ఎవరిని తీసుకోకపోవడంతో.. రైనా తిరిగి వస్తాడని అందరూ భావించారు. ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి చెన్నై జట్టులో రైనా ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. ఆ జట్టు సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రైనాను మళ్లీ ఐపీఎల్‌లో చూడాలని అభిమానులు కోరుకుంటుండగా.. అతని స్థానంలో చెన్నై మరో ఆటగాడిని తీసుకోవాలని చూస్తుందనే ఓ వార్త వారిని నిరాశకు గురిచేస్తోంది. రైనా మళ్లీ తిరిగి వస్తానని చెప్పినా.. చెన్నై జట్టు మేనేజ్‌మెంట్ పెద్దగా ఆసక్తి చూపట్లేదని.. అతని స్థానంలో ఇంగ్లాండ్ సంచలనం డేవిడ్ మలన్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట.
మరో 8 రోజుల్లో ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభ కానుంది. ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టాయి. చెన్నై జట్టులో సురేష్ రైనాతో పాటు హర్భజన్ సింగ్ కూడా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. భజ్జీ లేకపోవడం ఇబ్బందే అయినా.. మిచెల్ శాంటర్నర్, ఇమ్రాన్ తాహిర్, కరణ్‌శర్మ, రవీంద్ర జడేజా, పీయూశ్ చావ్లా వంటి మేటి స్పిన్నర్లు ఉండడంగా.. ఆ విభాగంలో చెన్నై చాలా పటిష్టంగాను ఉంది. ఇక బ్యాటింగ్‌లో కీలకమైన రైనా లేకపోవడం చెన్నై జట్టుకు పెద్దలోటే. ఆ లోటు భర్తీ చేసుకునేందుకు ఇంగ్లాండ్ ఆటగాడు మలన్‌ను తీసుకోవాలని చెన్నై జట్టు భావిస్తోందని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ తెలిపింది.
టీ20 ఫార్మాట్‌లో మలన్ 16 మ్యాచ్‌లే ఆడినప్పటికి.. ఈ ఫార్మాట్‌లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మలన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రైనాలాగే మలన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కావడం చెన్నైకి కలిసి వచ్చే అంశం. 'రైనా స్థానంలో డేవిడ్ మలన్ తీసుకుంటే ఎలా ఉంటుందనేదానిపై కేవలం చర్చలు మాత్రమే జరిగాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మలన్ టీ20 ఫార్మాట్‌కు సరిపోయే ఆటగాడు. రైనాలానే లెఫ్టార్మ్ కూడా. అయితే రైనా స్థానంలో మలన్‌ను భర్తీ చేయాలా? వద్దా? అనే విషయంపై టీమ్‌మెనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.'అని సీఎస్‌కే టీమ్ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ చెన్నై జట్టు మలన్‌ను తీసుకుంటే.. ఇక రైనాకు దారులు మూసుకుపోయినట్లే.