కృష్ణపట్నంలో డావ్ ఈవీటెక్ ప్లాంట్‌కు రంగం సిద్ధం..!
By Newsmeter.Network Published on 17 Dec 2019 11:20 AM ISTఅమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ సంస్థ ఆసక్తి చూపించింది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ భారత్‌లో ఆటోమొబైల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. కాగా ఈ కాంప్లెక్స్‌ను కృష్ణపట్నానికి సమీపంలో నెలకొల్పాలని డావ్ ఈవీటెక్ సంస్థ భావిస్తోంది. ఇందుకోసం 200 ఎకరాల స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డావ్ ఈవీటెక్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ప్రతి సంవత్సరం 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ డైరెక్టర్ బాలాజీ అచ్యుతని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల మోటర్లు, కంట్రోలర్స్, ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే ఆటోమొబైల్ కాంప్లెక్స్ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. దీని వల్ల రాష్ట్రంలో ప్రత్యేక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుందని, మరో 40 అనుబంధ సంస్థలు కూడా రాష్ట్రానికి వస్తాయని తెలిపారు.
భారత్‌లో డావ్ ఈవీటెక్ మొదటి ఎలక్ట్రికల్ వాహనాన్ని ఫిబ్రవరిలో విడదుల చేస్తామని సంస్థ చైర్మన్ మైఖేల్ లియో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 25 ఏళ్ల పాటు ఎలక్రటిక్ వాహన రంగంలో సాధించిన పురోగతితోనే భారత్‌లో అడుగు పెట్టామన్నారు. వచ్చే సంవత్సరం మొత్తం ఆరు కొత్త మోడళ్లను ప్రవేశపెడతామని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అసెంబ్లింగ్ యూనిట్లో వాహనాలను తయారు చేస్తున్నామని తెలిపారు. గంటకు 25 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించే హైస్పీడ్ మోడళ్లు 3, గంటకు 25 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించే స్పీడ్ మోడళ్లను రూపొందిస్తామన్నారు. ఈ వాహనాలను ఇంటర్నెట్తో అనుసంధానిస్తూ తయారుచేస్తామని కంపెనీ సీవోవో లానా జోయో వెల్లడించారు. వాహనాల ధర కనిష్టం రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఒక్కసారి చార్జ్ చేస్తే 100 నుంచి 125 కి.మీ వరకు ప్రయాణిస్తాయి. కృష్ణపట్నం సమీపంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందని కంపెనీ సీఎఫ్ఓ అచ్యుతుని బాలజీ అన్నారు.