ఏసీఈడీబీ స్కామ్‌.. జాస్తి కృష్ణ కిషోర్‌పై సీఐడీ కేసు..!

By అంజి  Published on  16 Dec 2019 3:35 AM GMT
ఏసీఈడీబీ స్కామ్‌.. జాస్తి కృష్ణ కిషోర్‌పై సీఐడీ కేసు..!

హైదరాబాద్‌: ఏపీఈడీబీ కుంభకోణంలో సస్పెండ్‌ అయిన ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై ఏపీ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ) కేసు నమోదైంది. ఎపీ సీఐడీ క్రైమ్ నంబర్ 22/2019 తో కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఆల్‌ ఇండియా సర్వీస్‌ ఆఫీసర్‌ కృష్ణ కిషోర్‌ను ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా చంద్రబాబు నియమించారు. ఏపీఈడీబీ కుంభకోణంపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చంద్రబాబు పాలనలో ఏపీఈడీబీలో చేసిన లావాదేవీలు, ఇతర ఒప్పందాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జాస్తి కృష్ణ కిషోర్‌ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. సెక్షన్ 188 ఇండియన్ పీనల్ కోడ్ (సివిల్ సర్వెంట్ ప్రకటించిన ఆదేశాల అవిధేయత), 403 ఆస్తి యొక్క నిజాయితీ లేని దుర్వినియోగం, 409 ఐపిసి (క్రిమినల్ దుర్వినియోగం), 120 (బి) (క్రిమినల్ కుట్ర) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ జారీ చేసింది.

1990 బ్యాచ్ ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ కేంద్రం నుంచి ఏపీ రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. చంద్రబాబు హయాంలో ఈడీబీ సీఈవోగా విధులు నిర్వహించారు. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత ఆయనను విధుల నుంచి తప్పించారు. తర్వాత కూడా ఎలాంటి పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. తనను రిలీవ్‌ చేస్తే కేంద్ర సర్వీసులకు వెళ్తానని కృష్ణ కిశోర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కానీ, ఆయనను ప్రభుత్వం రిలీవ్‌ చేయలేదు.

గత గురువారం అనూహ్యంగా ఆయనను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖల నుంచి అందుకున్న నివేదిక ఆధారంగానే తాము ఈ నిర్ణయం తీసున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కృష్ణ కిశోర్‌పై ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌, సీఐడీ విడివిడిగా కేసులు నమోదు చేసి, అక్రమాలపై విచారణ జరిపి ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ అధికారులు జాస్తి కృష్ణ కిషోర్‌పై కేసు నమోదు చేశారు.

సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనల ప్రకారం జాస్తి కృష్ణ కిశోర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు, క్రమ శిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతుందని వివరించారు. అంతేకాదు.. విచారణ పూర్తయ్యే వరకు హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లకూడదని కృష్ణకిశోర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ఆర్థిక అక్రమాలను వెలికి తీసినందుకే ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ విధులు నిర్వర్తించారు. జగతి పబ్లికేషన్స్‌లో అవినీతిని బయటపెట్టినందుకే సీఎం జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీ రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ వచ్చారని.. ఆయన 27 ఏళ్ల సర్వీసులో ఎక్కడా కూడా చెడ్డ పేరు రాలేదన్నారు.Next Story
Share it