Fact CHeck : దబాంగ్-3 నటుడు కూరగాయలు అమ్ముతూ ఉన్నాడా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2020 5:00 PM ISTలాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇక వలసకూలీల పరిస్థితి ఎంతో దారుణంగా ఉండేది. సొంత ఊరికి చేరుకోడానికి వందల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. వాళ్లలో కొందరు ప్రాణాలను కూడా కోల్పోయారు. లాక్ డౌన్ ఎంతో మంది జీవితాల మీద తీవ్ర ప్రభావం చూపించింది. కొన్ని కంపెనీలు మూతబడ్డాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయి. ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గించేశాయి మరికొన్ని సంస్థలు. ఎంతో మంది తలరాతలు మారిపోయిన ఘటనలకు సంబంధించి మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఉపాధి కోల్పోయిన చాలా మంది ఏదో ఒక పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారని మీడియాలో చూపించడం కూడా జరిగింది. లాక్ డౌన్ ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద కూడా పడింది. సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో షూటింగ్ లను నమ్ముకున్న వాళ్లు ఉపాధిలేక బాధపడ్డారు.
జావేద్ హైదర్ బాలీవుడ్ నటుడు దబాంగ్ 3 సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. లైఫ్ కి ఐసి కి తైసి,గాయాలు బాబర్ సినిమాల ద్వారానే కాకుండా టీవీ సిరీస్ లలో కూడా ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యాడు. యాక్ట్రెస్ డాలీ బింద్రా సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో జావేద్ హైదర్ కూరగాయలు అమ్ముతున్నాడంటూ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది.
నిజ నిర్ధారణ:
బాలీవుడ్ నటుడు జావేద్ హైదర్ కూరగాయలను అమ్ముతున్నాడు అన్నది 'పచ్చి అబద్ధం'
జావేద్ హైదర్ తన టిక్ టాక్ అకౌంట్ లో కూరగాయలను అమ్ముతూ ఉన్నట్లు పోస్టు పెట్టాడు. @javedhydersayyed2 అనే అకౌంట్ లో అతడు 'దునియా మె రెహనా హై' అనే వీడియోను జూన్ 23న పోస్టు చేశాడు. డాలీ ఆ వీడియో ను జూన్ 25న తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేసి జావేద్ హైదర్ కూరగాయలు అమ్ముతూ ఉన్నాడని తెలిపింది.
జావేద్ హైదర్ టిక్ టాక్ లో 2018 నుండి ఉన్నాడు. తన ఫాలోవర్స్ ను కవితలతోనూ, సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ తోనూ అలరిస్తూ ఉండేవాడు. 23 సంవత్సరాల యాక్టింగ్ అనుభవం ఉంది. 300 పైగా సినిమాల్లో నటించాడు. టైమ్స్ గ్రూప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మాట్లాడుతూ తాను అక్కడ కూరగాయల బండి ముందు నిలబడి వాటిని ఇప్పించుకుని వీడియో చేశానని తెలిపాడు.
తన వీడియో రాత్రికి రాత్రే వైరల్ అయిపోయిందని జావేద్ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో చూసిన చాలా మంది తాను ఆర్థికంగా చితికిపోయానని భావించారని.. ఎంతో మంది కామెంట్లు చేస్తూ వచ్చారని.. అలాగే మరి కొందరు ప్రైవేట్ గా ఎన్నో మెసేజీలు చేశారని చెప్పుకొచ్చాడు. ఇక డాలీ బింద్రా చేసిన ట్వీట్ కారణంగా తనకు పని లేకపోవడం వలన కూరగాయలు అమ్ముతున్నానని ఇంకొందరు భావించారని తెలిపాడు. డాలీ బింద్రా తన వీడియో చూసి తప్పుగా ఊహించుకుందని తాను కూరగాయలు అమ్మడం లేదని చెప్పానని అన్నాడు. నేను ఒక యాక్టర్ ను.. కూరగాయలు అమ్మే వ్యక్తిని కాదని తెలిపాడు. మరికొన్ని వీడియోలు కూడా చేస్తాను.. అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా చేయడమే తన కర్తవ్యమని జావేద్ ఈ ఇంటర్వ్యూలో తెలిపాడు.
లింక్స్:
తాజా వీడియోలో జావేద్ కవితలను చెప్పుకుంటూ వచ్చాడు.
బాలీవుడ్ నటుడు జావేద్ హైదర్ కూరగాయలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడన్నది అబద్దం.