మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన బీజేపీ నేత.. ఎందుకంటే..‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 9:11 AM GMT
మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన బీజేపీ నేత.. ఎందుకంటే..‌

కర్ణాటక సీఎం బీఎస్‌ యడియూరప్ప మంత్రివర్గంలోని కీలక సభ్యుడు సీటీ రవి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం రాత్రి సీఎంకు పంపించారు. సీటీ రవి ప్రస్తుతం రాష్ట్ర పర్యాట‌క‌ మంత్రిత్వశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

అయితే.. బీజేపీ అధిష్టానం ఇటీవ‌ల‌ ప్రకటించిన పార్టీ జాతీయ కమిటీలో సీటీ రవికి కీలక బాధ్యతలను అప్పగించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పోస్టింగ్‌ లభించింది. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన రవి.. సోమవారం ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న పార్టీ పిలుపుమేరకు కేబినెట్‌ నుంచి వైదొలినట్లు తెలుస్తోంది.

సీటీ రవి నేపథ్యంలో యడియూరప్ప మంత్రివర్గ విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన‌ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. అలాగే పార్టీలోని సీనియర్లు సైతం మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రవి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story
Share it