ఆస్పత్రి నుంచే ట్రంప్‌ వీడియో.. ఏం చెప్పారంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 8:18 AM GMT
ఆస్పత్రి నుంచే ట్రంప్‌ వీడియో.. ఏం చెప్పారంటే..?

కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఓ వీడియోను విడుదల చేశారు. తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, త్వరలోనే తాను తిరిగి వస్తానని.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ తెల్లవారుజామున 4.21 గంటలకు తన ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్, సమీప భవిష్యత్తు తనకు నిజమైన పరీక్షని, దీనిలో విజయం సాధించి బయటకు వస్తాననే అనుకుంటున్నానని చెప్పారు. "నేను ఇక్కడికి రావడం ఏమంత మంచిగా అనిపించడం లేదు. ప్రస్తుతం కొంచెం ఫర్వాలేదు. త్వరలోనే బయటకు వచ్చి, నేను ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తాననే భావిస్తున్నాను. రానున్న రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి" అని ఆయన ఆ వీడియోలో అన్నారు.

అయితే.. ఆ వీడియోపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో నిజమైనదేనా..? లేక ముందుగానే దీన్ని చిత్రీకరించారా..? అన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ట్రంప్ బాగానే కనిపిస్తున్నారు. గొంతు మాత్రం కాస్తంత తేడాగా ఉన్నట్టు తెలుస్తోంది. వైట్ డ్రస్ పై నీలి రంగు బ్లేజర్ వేసుకుని ట్రంప్ కనిపించారు. ప్రస్తుతం తాను ఆసుపత్రి నుంచి పనిచేయడం మినహా మరేమీ చేయలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ ఆరోగ్యంపై ఆయన వ్యక్తిగత వైద్యుడు సీన్‌ కాన్లే మాట్లాడారు. వైరస్‌ సోకిందని తెలియగానే ఆస్పత్రిలో చేర్చడానికి ముందు అదనపు ఆక్సిజన్‌ అందజేశామని తెలిపారు. తర్వాత ఆ అవసరం రాలేదన్నారు. గత 24 గంటల్లో ఆయనకు జ్వరం ఏమీ రాలేదని వెల్లడించారు. అయితే.. పూర్తిగా ప్రమాదం నుంచి బయట పడ్డారని కూడా చెప్పలేమన్నారు. మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌ అందిస్తున్నామన్నారు. వైరస్‌ నిర్థారణ అయినప్పటితో పోలిస్తే ఇప్పుడు ట్రంప్‌ ఆరోగ్యం మెరుగైందన్నారు.

Next Story