ఆందోళనకరంగా ట్రంప్ ఆరోగ్యం?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Oct 2020 3:52 AM GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తొలిరోజే ఆయనకు కృత్రిమ శ్వాస కల్పించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ట్రంప్‌ను మిలటరీ ఆస్పత్రికి తరలించడానికి ముందే వైట్‌హౌస్ వైద్యులు ఆక్సిజన్‌తో శ్వాస కల్పించారని వార్తలు వినిస్తున్నాయి.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషయమై రాబోయే 48 గంటల అత్యంత కీలమని వైద్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది. 74 ఏళ్ల ట్రంప్‌కు స్థూలకాయం, కొలెస్టరాల్ తో బాధపడుతున్నారని వైద్యులు ఇదివరకే ధృవీకరించారు. ప్రస్తుతం ఆయనకు రెమ్‌డెసీవీర్‌తో పాటు యాంటీబాడీలతో కూడిన వైద్యాన్ని అందిస్తున్నారు.
ఈ విషయమై ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు, నేవీ కమాండర్ డాక్టర్ సీన్ కోన్లీ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం దాట వేశారు. మిలటరీ ఆస్పత్రిలో కూడా అధ్యక్షుడికి కృత్రిమ శ్వాస కల్పించలేదని ఆయన చెప్పారు. గడిచిన 24 గంటల్లో ఆయనకు జ్వరమే రాలేదని అన్నారు.
ఇక ట్రంప్ సన్నిహిత వర్గాల సమాచారం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఆయన కీలక అవయవాల పనితీరు ఆందోళనకరంగా మారింది. వచ్చే 48 గంటలు ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చాలా కీలకమైనవిగా భావిస్తున్నారు. అధ్యక్షుడు మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి రావచ్చని వైట్‌హౌస్ వర్గాలు తెలుపుతున్నాయి.