యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్

యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో తండ్రీ కూతురిపై అసభ్యకరమైన సంభాషణలు చేసిన తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు బెంగళూరులో అరెస్టయ్యాడు.

By Medi Samrat  Published on  10 July 2024 11:56 AM GMT
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్

యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో తండ్రీ కూతురిపై అసభ్యకరమైన సంభాషణలు చేసిన తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు బెంగళూరులో అరెస్టయ్యాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బుధవారం బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకుని.. హైదరాబాద్‌కు త‌ర‌లించ‌డానికి బెంగళూరు కోర్టులో హాజరుపరిచింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రణీత్ తన తాజా వీడియోలో హాస్యం పేరుతో తండ్రీకూతుళ్ల సంబంధంపై అనుచితమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రణీత్ కంటెంట్‌ను పెద్ద ఎత్తున ఖండించారు. పోక్సో చట్టం కింద ప్రణీత్‌ను అరెస్ట్ చేయాలంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేశారు. ప్రణీత్ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరోలో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.

ఇదిలావుంటే.. ప్రణీత్ వీడియోపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. అత‌డు వీడియోలోని అభ్యంతరకరమైన భాగాలను తీసివేశాడు. ట్విట్టర్ లో క్షమాపణలు చెప్పాడు, “వీడియో నుండి సమస్యాత్మక భాగాన్ని సవరించాను. కంటెంట్ క్రియేట‌ర్‌గా నా ప్రయత్నం ఎప్పుడూ న‌వ్వించ‌డ‌మే. ఈ సారి నేను హ‌ద్దు దాటానని క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.

ప్రణీత్ హనుమంతు.. ఒక నటుడు, ఇంటర్వ్యూయర్.. యూట్యూబర్. కొత్త సినిమాల‌ ప్రమోష‌న్‌ కోసం పలువురు నటీనటులను కూడా ఇంటర్వ్యూ చేసాడు. హాయ్ నాన్న సినిమా కోసం నానిని, భజ వాయు వేగం రిలీజ్‌కు ముందు కార్తికేయ గుమ్మకొండల‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు

ఇటీవల సుధీర్‌బాబు 'హరోమ్‌హర' సినిమాలో నటించాడు. ప్రణీత్ హనుమంతు అభ్యంతరకరమైన వ్యాఖ్యల నేప‌థ్యంలో సుధీర్ తన అధికారిక X ఖాతాలో.. హరోమ్ హరలో ఓ పాత్ర కోసం ప్రణీత్ హనుమంతును పాత్రకు ఎంపిక చేసినందుకు క్షమాపణలు కోరాడు. మంచో చెడో నేను సోషల్ మీడియా వ్యక్తిని కాదు.. ప్రణీత్ హనుమంతు హరోమ్‌హారలో నటించినందుకు నేను చాలా అసహ్యంగా భావిస్తున్నాను. నేను, నా సినిమా యూనిట్ త‌రుపున‌ హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు.

Next Story