జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువకుడు బాలికను అతి దారుణంగా హత్య చేశాడు. బాలికను కత్తితో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి చంపేశాడు. ఈ ఘటన గర్వా జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖరోంధి పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల షబ్నమ్ ఖాతూన్ 9వ తరగతి చదువుతోంది. బాలికను కరివాడిహ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఇమ్తేయాజ్ అన్సారీ ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తున్నాడు. మంగళవారం నాడు మధ్యాహ్నం బాలిక తన తోటి విద్యార్థులతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఆమెను అతడు అడ్డుకున్నాడు. ఆ తర్వాత బాలికను కత్తితో పొడిచాడు. దీంతో బాలిక ప్రతిఘటించింది.
వెంటనే నిందితుడు తన దగ్గరున్న నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన జరిగిన తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమోద్ కుమార్, బన్షీధర్ నగర్ SDPO సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి క్లాస్‌మేట్‌ను విచారించారు. అతను "హంతకుడి" అరెస్టును త్వరలో నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడు ఇమ్తేయాజ్ అన్సారీ గత రెండేళ్లుగా షబ్నమ్‌ను వేధిస్తున్నాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు అతడిని కొట్టారు. అయినప్పటికీ అతను వేధింపులు మానుకోలేదు. తన ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించకుంటే షబ్నమ్‌ను చంపేస్తానని బెదిరించాడు'' అని బాధితురాలి తల్లి సకీనా బీబీ చెప్పారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.