దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో మైనర్ల బృందం 12 సార్లు కత్తితో పొడిచి 20 ఏళ్ల యువకుడిని చంపిందని.. ఈ కేసులో తొమ్మిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మృతుడు సంగం విహార్ ప్రాంతానికి చెందిన షాదాబ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం 6 గంటలకు టిగ్రీ పోలీస్ స్టేషన్ పరిధి సంగం విహార్‌లోని హరిజన్ కాలనీలో జరిగిన కత్తిపోటు ఘటనపై పోలీసు కంట్రోల్ రూమ్ కాల్ రావడంతో పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న షాదాబ్‌ని పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
షాదాబ్ శరీరంపై చాలా కత్తిపోట్లు కనిపించాయి. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకిత్ చౌహాన్ తెలిపారు. తొమ్మిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని.. వారి వద్ద నుంచి నాలుగు కత్తులు, ఒక కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. "ఈ యువకులలో కొందరికి గతంలో హేయమైన కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు తేలింది" అని డీసీపీ పేర్కొన్నారు. “రెండు రోజుల క్రితం మద్యం మత్తులో తమకు, షాదాబ్‌కు మధ్య వాగ్వాదం జరిగిందని.. అందుకే షాదాబ్‌కు గుణపాఠం చెప్పాలని ప్లాన్ చేసినట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు.