నాంపల్లిలో రౌడీ షీటర్ దారుణ హత్య
హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది.
By Medi Samrat
హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఒక రౌడీ షీటర్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్ ఖురేషీ అనే వ్యక్తిపై రౌడీ షీట్ ఉంది. ఇతను ఒక కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు హాజరై తిరిగి వెళుతున్నాడు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి వద్దకు రాగానే, అప్పటికే మాటు వేసి ఉన్న ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశారు. మొదట దుండగులు ఖురేషీని క్రికెట్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టారు. అనంతరం కత్తులతో పొడిచి హతమార్చారు. నిందితులు హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తులను సంఘటనా స్థలంలోనే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే నాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.