శ్రీకాకుళం జిల్లా మామిడిపల్లి పంచాయతీ రాజాం గ్రామానికి చెందిన యలమంచి గోపాల్ (27) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైవాహిక జీవితంలో కలహాల కారణంగానే గోపాల్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బారువ పోలీసుల వివరాల ప్రకారం.. రాజాం గ్రామానికి చెందిన యలమంచి బైరమ్మకు ముగ్గురు కుమారులు. వీరిలో ఇద్దరు విదేశాలకు వలస కార్మికులుగా పని నిమిత్తం వెళ్లారు. మూడో కుమారుడు గోపాల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గోపాల్‌కి అదే గ్రామానికి చెందిన చాందినితో 18 నెలల క్రితం వివాహమైంది.
అయితే భార్యాభర్తల మధ్య ఆరు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాందిని పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ పెద్దలు రెండుసార్లు పంచాయితీ నిర్వహించి దంపతులను కలిపేందుకు నిర్ణయించారు. ఈ నెల 6న మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. భార్యకు ఎంత చెప్పినా తన మాట వినడం లేదని.. మనస్తాపానికి గురైన గోపాల్ ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తల్లి వెంటనే హరిపురం సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే గోపాల్ మృతితో రాజాం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.