అప్పు తీర్చేందుకు రూ.2 వేలు దొరకలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం పొన్నాల్‌కు చెందిన మర్యాల ఆనంద్ (23) ఓ బయోటెక్ కంపెనీలో పని చేస్తున్నాడు. 3 నెలల క్రితం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కి చెందిన ఓ వ్యక్తి వద్ద ఆనంద్ రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. శుక్రవారం రోజున ఓ మహిళతో పాటు మరో ఐదుగురు పొన్నాలలోని ఆనంద్ ఇంటికి వచ్చి.. అప్పు తీర్చాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆనంద్.. తన దగ్గర ప్రస్తుతం డబ్బు లేదని, త్వరలోనే ఇస్తానని చెప్పాడు. అయితే ఆనంద్ మాటలు వినని వారు.. అక్కడే మొండికేసి కూర్చున్నారు. కనీసం 2 వేల రూపాయలైన ఇస్తే.. కొత్త నోటు రాసుకొని వెళ్తామని ఆనంద్‌ను ఒత్తిడికి గురిచేశారు.
రూ.2 వేల కోసం ఆనంద్ తనకు తెలిసిన వారందరిని అడిగాడు. అయితే డబ్బులు ఇవ్వడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. డబ్బు ఇచ్చే వరకు వెళ్లేది లేదంటూ అక్కడే తిష్టవేసి కూర్చున్నారు. డబ్బులు ఇచ్చే వరకు తమతో రావాలని చెప్పగా.. వారితో ఆనంద్ తుర్కపల్లి వరకు వెళ్లాడు. అప్పటికి తెలిసిన ఓ వ్యక్తి రూ. 1000 ఇచ్చాడు. దీంతో వచ్చిన వారికి విందు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కొత్త నోటు రాసుకుని వారు వెళ్లిపోయారు. తిరిగి ఇంటికి వచ్చిన ఆనంద్.. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రూ.2 వేల కోసం తనని ఎవరూ నమ్మలేదని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.