యువ జర్న‌లిస్ట్ దారుణ హ‌త్య‌.. ఆ నకిలీ వాటిపై కథనాలు రాసినందుకే

Young journalist brutally murdered in bihar. 4 రోజుల కిందట కిడ్నాప్‌కు గురైన 22 ఏళ్ల యువ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ నకిలీ వాటిపై కథనాలు రాశాడని

By అంజి  Published on  14 Nov 2021 10:39 AM IST
యువ జర్న‌లిస్ట్ దారుణ హ‌త్య‌.. ఆ నకిలీ వాటిపై కథనాలు రాసినందుకే

4 రోజుల కిందట కిడ్నాప్‌కు గురైన 22 ఏళ్ల యువ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ నకిలీ వాటిపై కథనాలు రాశాడని జర్నలిస్టుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని మధుబని చెందిన బుద్ధినాథ్‌ జా అలియాస్‌ అవినాష్‌ జా జర్నలిస్టుగా పని చేస్తున్నారు. లోకల్‌ న్యూస్‌ పోర్టల్‌లో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా ఇటీవల నకిలీ క్లినిక్‌లపై కథనాలు రాశాడు. అనంతరం వాటిని తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అప్పటి నుండి బుద్ధినాథ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌ రావడం మొదలైంది. కొందరైతే తమ క్లినిక్‌లను బయటకు లాగొద్దంటూ జర్నలిస్టుకు డబ్బు ఆశ చూపారు. అయినా జర్నలిస్టు బుద్ధినాథ్‌ ఎక్కడా వెనకడుగు వేయలేదు.

ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి సమయంలో అతడు కిడ్నాప్‌కు గురయ్యాడు. మంగళవారం రాత్రి 10 గంటలకు బెనిపట్టీ లోహియా చౌక్‌లోని తన ఇంటి వద్ద బుద్ధినాథ్‌ చివరిసారిగా కనిపించినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది. బెనిప‌ట్టి పీఎస్‌కు 400 మీటర్ల దూరంలోనే బుద్ధినాథ్‌ నివాసం ఉంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బుద్ధినాథ్ బయటకు వచ్చాడు. అతని ఇంటి దగ్గర అమర్చిన క్లోజ్ సర్క్యూట్ కెమెరాల నుండి అందుబాటులో ఉన్న ఫుటేజ్ ప్రకారం, బుద్ధినాథ్ తన ఇంటి నుండి అనేక సార్లు సమీపంలోని లేన్ వైపు మొబైల్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్లాడు. అతను చివరిసారిగా రాత్రి 9.58 గంటలకు మెడలో పసుపు కండువాతో తన ఇంటి నుండి బయలుదేరాడు. అనంతరం స్థానిక చౌక్, మరో ఇల్లు, బేనిపట్టి పోలీస్ స్టేషన్ మీదుగా నడిచాడు. మార్కెట్‌లో రాత్రి 10.05 నుంచి 10.10 గంటల మధ్య బుద్ధినాథ్ కనిపించినట్లు స్థానికుడు తెలిపారు.

అప్పటి నుండి అతని జాడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జర్నలిస్టు బుద్దినాథ్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేసిన పోలీసులు.. బుధవారం రాత్రి బెటౌన్‌ వద్ద ఫోన్‌ సిగ్నల్స్ కట్‌ అయినట్లు గుర్తించారు. శుక్రవారం నాడు హైవేపై ఒక మృతదేహం ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత మృతదేహాం చేతికి ఉన్న రింగ్‌, మెడలోని బంగారు గొలుసు, కాలి గాయం ఆధారంగా అతడిని బుద్ధినాథ్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. పెట్రోల్‌ పోసి నిప్పంటించి బుద్ధినాథ్‌ను చంపినట్లుగా పోలీసులు నిర్దారించారు. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

Next Story