పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వివాహిత ఆత్మహత్య.. కౌన్సిలింగ్ ఇస్తుండగానే
Women commits suicide in police station in Vizag.కుటుంబ కలహాలతో ఓ జంట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
By తోట వంశీ కుమార్
కుటుంబ కలహాలతో ఓ జంట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తుండగా మధ్యలో బయటకు వచ్చిన వివాహిత పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖ ఎంవీపి పోలీస్ స్టేషన్‌లో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన శ్రావణి(22) విశాఖలోని ఓ ప్రైవేటు కాలేజీలో లా చదువుతోంది. అదే కాలేజీలో సీనియర్ అయిన వినయ్ కుమార్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో వారికి చెప్పకుండా శ్రావణి జూన్ నెలలో వినయ్‌కుమార్‌ని వివాహం చేసుకుంది. అయితే.. వినయ్‌కుమార్‌కు ఇది రెండో వివాహం.
వినయ్‌కుమార్ రెస్టారెంట్‌లో పని చేస్తుండగా.. శ్రావణి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తోంది. వివాహం జరిగిన కొన్ని రోజుల పాటు సజావుగానే సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఇటీవల తరచుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మూడు రోజుల క్రితం శ్రావణి భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో దంపతులు ఇద్దరిని పోలీసులు స్టేషన్‌కు పిలిచారు. తొలి అంతస్తులో కౌన్సిలింగ్ చేపట్టారు. అయితే.. కౌన్సిలింగ్ మధ్యలో శ్రావణి బయటకు వచ్చింది. తాను తప్పు చేశానని గట్టిగా అరుస్తూ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ పరుగున వెళ్లి ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఆమె అగ్నిపుల్ల వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రావణిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కాపాడబోయిన ఎస్ ఐ చేతులకు గాయాలు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.