భార్య అక్ర‌మ‌ సంబంధం గురించి తెలుసుకున్న భ‌ర్త‌.. పంచాయితీ పెట్టగా..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తాప్‌ఘ‌ర్‌లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

By Medi Samrat  Published on  29 July 2024 6:44 PM IST
భార్య అక్ర‌మ‌ సంబంధం గురించి తెలుసుకున్న భ‌ర్త‌.. పంచాయితీ పెట్టగా..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌తాప్‌ఘ‌ర్‌లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంద‌నే ఆరోపణలతో వివాహితను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించి, ముఖంపై మ‌సి పూసి న‌ల్ల‌గా మార్చార‌ని పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హతిగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి 15 మందిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఆ మహిళ భర్త ఉద్యోగం నిమిత్తం ముంబైలో నివసిస్తున్నాడు. తన భార్య వ్యవహారం గురించి తెలుసుకున్న తర్వాత భ‌ర్త‌ ఇంటికి తిరిగి వచ్చాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

అక్రమ సంబంధం విష‌య‌మై ఆదివారం మహిళ కుటుంబీకుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయతీ ఆదేశాల మేరకు.. మహిళను చెట్టుకు కట్టేసి.. జుట్టు కత్తిరించి, ముఖంపై మసి రాశార‌ని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ రాయ్ తెలిపారు. నలుగురు పిల్లల తండ్రి అయిన ప్రియుడు ఆమెను రక్షించడానికి ప్రయత్నించగా.. అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో అత‌డు అక్కడి నుంచి పారిపోయాడని ఏఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని సంజయ్ రాయ్ తెలిపారు.

పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ నంద్ లాల్ సింగ్ ఫిర్యాదు మేరకు.. 20 మందిపై కేసు నమోదు చేసి 15 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఐదుగురిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారి తెలిపారు.

Next Story