మూడో అంతస్తు నుంచి 3 నెలల కూతురిని విసిరేసిన త‌ల్లి

Woman throws 3-month-old daughter off hospital's third floor. 23 ఏళ్ల మహిళ అహ్మదాబాద్‌లోని ఓ సివిల్ హాస్పిటల్‌లోని మూడో అంతస్తు నుంచి తన 3 నెలల కూతురిని విసిరేసింది.

By M.S.R  Published on  2 Jan 2023 3:15 PM GMT
మూడో అంతస్తు నుంచి 3 నెలల కూతురిని విసిరేసిన త‌ల్లి

23 ఏళ్ల మహిళ అహ్మదాబాద్‌లోని ఓ సివిల్ హాస్పిటల్‌లోని మూడో అంతస్తు నుంచి తన 3 నెలల కూతురిని విసిరేసింది. దీంతో పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అసర్వా ప్రాంతంలోని వైద్యశాలలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలోని పెట్లాడ్ తాలూకా నివాసి ఫర్జానాబాను మాలెక్ ఈ నిర్ణయం తీసుకుంది. తన బిడ్డ అమ్రిన్‌బాను పుట్టినప్పటి నుండి అనారోగ్యంతో ఉందని.. తన కుమార్తె బాధను చూసి తట్టుకోలేక ఈ పని చేసినట్లు తెలిపిందని అదనపు కమిషనర్ పిపి పిరోజియా చెప్పారు. ఆమె మొదట ఆసుపత్రి నుండి బిడ్డ కనిపించకుండా పోయిందని చెప్పడం ద్వారా పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. కానీ సివిల్ ఆసుపత్రిలోని సిసిటివి ఫుటేజ్ లో మొత్తం విషయం బయటపడింది. గత రెండు వారాలుగా ఆమె బిడ్డకు చికిత్సను అందిస్తూ వస్తున్నారు. "అమ్రిన్ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గ్రౌండ్ ఫ్లోర్‌లో గుర్తించారు. ఆ మహిళ తన నేరాన్ని అంగీకరించింది" అని ఏసీపీ పిరోజియా తెలిపారు.

షాహిబాగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో, బిడ్డ పుట్టిన వెంటనే అస్వస్థతకు గురికావడంతో వడోదరలోని ఎస్‌ఎస్‌జి ఆసుపత్రిలో ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. కలుషిత నీరు తాగడమే చిన్నారి అస్వస్థతకు కారణమని బిడ్డ తండ్రి ఆసిఫ్ పోలీసులకు తెలిపారు. పరిస్థితి విషమించడంతో డిసెంబర్ 14న చిన్నారిని నదియాడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆసిఫ్‌ తన భార్య, కూతురు ఆస్పత్రిలో కనిపించడం లేదని తెలుసుకుని సిబ్బందిని అప్రమత్తం చేసి పోలీసులకు ఫోన్‌ చేశాడు.


Next Story